హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మరోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. గత రెండేండ్లలో 78,114 ఫోన్లను రికవరీ చేసి ప్రశంసలు అందుకున్నారు. వాటిలో అత్యధికంగా 11,879 ఫోన్లను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో, 10,385 మొబైల్స్‌ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, 8,681 ఫోన్లను రాచకొండ పరిధిలో బాధితులకు అప్పగించారు.
కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో 2022 సెప్టెంబర్ 5న ప్రయోగాత్మకంగా ప్రారంభమైన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ సేవలు తెలంగాణలో 2023 మే 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సీఈఐఆర్ పోర్టల్ సేవ లు 227 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానాన్ని దకించుకోవడం విశేషం. ఈ ఘనత సాధించడంలో కీలకపాత్ర పోషించిన సీఐడీ విభాగాన్ని డీజీ శిఖాగోయెల్ను, సైబర్‌క్రైం ఎస్పీ బీ గంగారాం బృందాన్ని డీజీపీ జితేందర్ అభినందించారు.