కూసుమంచి, మే 12: ఎన్నికల వేళ సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.99.94 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. హైవే మీదుగా కాకుండా సూర్యాపేట నుంచి నాయకన్‌గూడెం మీదుగా ఖమ్మం వస్తున్న ఇన్నోవా వాహనాన్ని నాయకన్‌గూడెం వద్ద పోలీసులు ఆపారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లడంతో పోలీసులు దానిని వెంబడించారు. వారికి దొరకకుండా వేగంగా ఖమ్మం వైపునకు వెళ్తున్న ఆ ఇన్నోవా వాహనం కేశవాపురం సమీపంలోని దేవునితండా వద్ద పల్టీ కొట్టింది. అందులోని రెండు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఆ వాహనంలోని వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుకనే వచ్చిన పోలీసులు.. పల్టీ కొట్టిన ఆ వాహనంలో చిక్కుకుపోయిన వ్యక్తిని బయటకు తీశారు. అతడికి గాయాలు కావడంతో ఖమ్మం దవాఖానకు తరలించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో ఉన్న రూ.500 కట్టలను ఐటీ అధికారుల సమక్షంలో లెక్కించగా రూ.99.94 లక్షలు ఉన్నట్టు నిర్ధారించారు. పూర్తిస్థాయి విచారణ తరువాత ఆ నగదు ఎవరిదనే విషయాన్ని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
చేగుంట, మే 12: మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి చౌరస్తా వద్ద పోలీసులు రూ.88.43 లక్షల నగదును పట్టుకున్నారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, పెద్ద శివునూర్ గ్రామ శివారులోని ఓ గెస్ట్‌హౌస్ సమీపం నుంచి వస్తున్న కారును తనిఖీ చేయగా ఈ డబ్బులు లభించాయి. ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.