హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే నిరుడు మొదటిస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల్లో రెండో స్థానానికి దిగజారింది. రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను రికవరీ చేశారు. మొబైల్ దొంగతనాలను అరికట్టడానికి సీఈఐఆర్ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించగా, తెలంగాణలో అదే ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు.
8 రోజుల్లోనే 1,000 పరికరాలను రికవరీ చేసి, వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 82 మొబైళ్లను రికవరీ చేస్తున్నారు. మొదటి 189 రోజుల్లో 10,000 ఫోన్లు, 291 రోజుల్లో 20 వేలు, ఏడాదిలో 30 వేలు, 459 రోజుల్లో 37 వేల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,808 ఫోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,174, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,030 మొబైల్ పరికరాలను రికవరీ చేసినట్టు డీజీపీ తెలిపారు.