హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): చేనులో ఉండాల్సిన రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ఠాణాల్లో కుక్కింది. పట్నంలో సర్కార్‌ను కలుద్దామని బస్సు ఎక్కిన రైతన్నను పోలీసు జీపు ఎక్కించింది. పొలం పనుల్లో ఉండాల్సిన తమను పోరుబాట పట్టేలా చేసిందెవరు? రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టిందెవరు? అని రైతాంగం నిలదీస్తున్నది. మరోవైపు రైతాంగానికి సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు.
అక్రమంగా అరెస్టు చేసిన రైతులను విడిచిపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రుణమాఫీ అమలు కాని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి నుంచే రైతులను, వారికి సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడం ప్రారంభించారు. కొన్నిచోట్ల పొలం పనుల్లో ఉన్న రైతులను సైతం పోలీసులు నిర్బంధించారు. రైతుల అక్రమ అరెస్టులతో రాష్ట్రం అట్టుడికింది.
ఎక్కడికక్కడ అరెస్టులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీసు నిఘా పెట్టారు. రైతు అని అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరిని అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇండ్ల ముందు అర్ధరాత్రి నుంచే గస్తీ తిరిగారు. ఏ కారణం చేత బయటికి వచ్చినా పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. హైదరాబాద్ ప్రధాన రహదారులపై నిఘా పెట్టారు. ఇక ప్రజాభవన్ పోలీస్ క్యాంపును తలపించింది. వందలమంది పోలీసులతో ప్రజాభవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
దొంగలమా? టెర్రరిస్టులమా?
శాంతియుతంగా నిరసన చేస్తామని తెలిపినా ప్రభుత్వం తమపై కర్కశంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారా? అని ప్రశ్నించారు. తామేమైనా దొంగలమా? టెర్రరిస్టులమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతుల్లేకుండా ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే తాము ప్రజాభవన్‌కు వచ్చేవాళ్లం కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు.
రుణమాఫీపై పోరాటం ఆగదు
రుణమాఫీపై పోరాటం ఆగదని రైతాంగం స్పష్టం చేసింది. షరతులు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేసేవరకు పోరాటం చేస్తామని రైతులు తేల్చిచెప్పారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచివేయలేరని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అక్రమ అరెస్టులా? అని ప్రశ్నించారు.
జెండా మోసినందుకు ఇదా ప్రతిఫలం?
భుజం కాయలు కాసేలా కాంగ్రెస్ జెండా మోసిన తమకు సీఎం రేవంత్‌రెడ్డి మంచి గుణపాఠం చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమను అవమానాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా అరెస్టులా అని మండిపడ్డారు.
ప్రజాభవన్ అని పేరుపెట్టుకోవటం ఎందుకని? ప్రజల్లో తాము లేమా? అని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ అయ్యేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు రుణమాఫీ’ అనే వాట్సాప్ గ్రూపులో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు.
రైతు ముందు సర్కారు తలవంచక తప్పదు: కేటీఆర్
Ktr
రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ‘చలో ప్రజాభవన్’కు పిలుపునిచ్చిన రైతులను అరెస్ట్ చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులేమైనా దొంగలా? ఉగ్రవాదులా? అని నిప్పులు చెరిగారు.
అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని కోరారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులంటే సీఎంకు భయం ఎందుకని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన బాట పట్టారని గుర్తుచేశారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదని, రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
మాఫీ చేయమంటే అరెస్టులా? : నిరంజన్‌రెడ్డి
రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని అడిగిన రైతులను అరెస్టులు చేస్తారా? అని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంతవరకు రూ. 2 లక్షల రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తమకు రెండు లక్షల రుణమాఫీ కావాలనే ఆత్రుతతో అంతకు మించి ఉన్న అప్పును వడ్డీలకు తెచ్చి కట్టారని, ఆ రైతులకు కూడా రుణమాఫీ చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుల అరెస్టు అప్రజాస్వామికం : కొప్పుల
ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. రైతుల అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొనారు. నమ్మించి మోసం చేయడమే ఇందిరమ్మ రాజ్యం ధ్యేయంగా మారిందని దుయ్యబట్టారు. పోలీసు యాక్ట్ పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కొప్పుల హెచ్చరించారు.
ఆంక్షల్లేవు.. కంచెల్లేవా?: హరీశ్‌రావు
Harishrao
రైతులంటే సీఎం రేవంత్‌రెడ్డికి వణుకు ఎందుకని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ‘చలో ప్రజాభవన్’కు పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకుపుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నాయకులను నిర్బంధిస్తూ వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నల అరెస్టులు దుర్మార్గమని మండిపడ్డారు.
‘మాది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలులేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్‌రెడ్డి ఇదేంది? ప్రజాభవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బారికేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలు? ప్రజాభవన్‌కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయం?’ అని నిప్పులు చెరిగారు. రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. మాట తప్పడమే ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నదని హెచ్చరించారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదురోవడం అంటే రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదని విమర్శించారు.
నర్సంపేటలో మెడికల్ కాలేజీ, జనరల్ దవాఖానను మంత్రులు ప్రారంభిస్తున్నారన్న కారణంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు గురువారం ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో సాధించిన పురోగతిని తెలుపుతూ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి తాజా నివేదికలో స్పష్టంగా చెప్పిందని హరీశ్‌రావు తెలిపారు. ఇది దాచేస్తే దాగని సత్యమని, దివాలా అని దివాలాకోరు మాటలు మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.