హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణతోపాటు నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటంలోనూ తామే నంబర్ వన్ అని తెలంగాణ పోలీసులు నిరూపించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన పోలీసులు మిగతా రాష్ర్టాలకంటే ముందున్నారు. సైబర్ నేరగాళ్లను గుర్తించి, శిక్ష పడేలా చేయడంలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన డాటా ప్రకారం సైబర్ నేరాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు పాలిత రాష్ర్టాలు చాలా వెనుకబడి ఉన్నాయని తేటతెల్లం అయ్యింది.
గత మూడేండ్లలో ( 2019 నుంచి 2021 వరకు) ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 30 వేల కేసులు నమోదు అయ్యాయి. అందులో 8 వేల మంది నేరస్థులను అరెస్టు చేయగా, వారిలో 359 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించి, శిక్షలు వేశాయి. దోషులను గుర్తించడం, కోర్టుల్లో వారి నేరాలను నిరూపించడంలోనూ తెలంగాణ పోలీసులు మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు, హర్యానా, ఉత్తరాఖండ్ పోలీసులు ఈ విషయంలో చాలా వెనుకబడి జీరో స్థానంలో ఉన్నారు.
సైబర్ నేరాలు-చట్టాలపై అవగాహన ఉండాలి
సైబర్ నేరస్థులను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు దేశంలో అందరికన్నా ముందున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో సరైన ఆధారాలు పట్టుకొని కోర్టుల్లో నిరూపించే నైపుణ్యం పోలీసులకు లేదు. కోర్టుల్లో చెల్లుబాటయ్యే సాక్ష్యాలను సమర్పించటంలో వివిధ రాష్ర్టాల పోలీసులు విఫలం అవుతున్నారు. కరోనా తర్వాత దేశంలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలోని సైబర్ చట్టాలు కూడా కఠినంగా లేకపోవడంతో నేరస్థులకు భయంలేకుండా పోయింది. సైబర్ నేరాలు-చట్టాల పై పోలీసులకు, సామాన్యులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది.
-పవన్ దుగ్గల్, సైబర్ వ్యవహారాల నిపుణుడు.