విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నీలగిరి, ఆగస్టు 9: సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్(టీటీసీ)ను సోమవారం మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో వచ్చిన నూతన టెక్నాలజీతో నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు. ఇతర రాష్ర్టాల పోలీసులు మన పోలీసుల సహకారంతో అక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. మహిళల హక్కులను కాపాడటం, బాధిత మహిళలకు అన్ని రకాల సేవలు అందించడం కోసం తెలంగాణ పోలీస్ చేసిన తొలి ప్రయోగం భరోసా కేంద్రమని చెప్పారు. కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డీజీపీ మహేంద ర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.