హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పోలీస్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ స్థాయి నుంచి అధికారి వరకు వృత్తిలో నైపుణ్యం సాధించడం అవసరమని డీజీపీ జితేందర్ అన్నారు. ప్రస్తుత సైబర్ క్రైమ్ సహా పోలీసింగ్‌లో అన్ని రకాల సాంకేతిక నైపుణ్యత ఉండాలని సూచించారు. రాష్ట్ర పోలీస్‌శాఖలో 35 వేలమంది కానిస్టేబుల్స్‌కు గ్రాడ్యుయేషన్ లేదని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్హతలతో పనిచేస్తున్న కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) స్థాయి సిబ్బందికి డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీతో గురువారం ఎంఓయూ చేసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణితో కలిసి వివరాలు వెల్లడించారు. కానిస్టేబుల్, ఏఎస్సైలకు ఓపెన్ డిగ్రీ ద్వారా నైపుణ్యం పెంపొదిస్తామని డీజీపీ చెప్పారు. కార్యక్రమంలో ఏడీజీ(లాఅండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, టీఎస్డీజీ వీవీ శ్రీనివాసరావు, సీఐడీ చీఫ్ చారుసిన్హా సహా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.