జనగామ, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ)/వర్ధన్నపేట: రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా బండి సంజయ్ చేపట్టిన విద్వేష యాత్రను వెంటనే నిలిపివేయాలని బీజేపీ నాయకులకు పోలీసు లు నోటీసులు జారీచేశారు. జనగామ నుంచి వరంగల్ జిల్లా జఫర్గడ్ మండలంలోని పామునూరు, ఉప్పుగల్లు వరకు పాదయాత్ర చేరుకొంటున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అతని వెంట ఉన్న నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ప్రజాసంగ్రామయాత్ర కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ మనోహర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీ ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌కు వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు నోటీసులు జారీచేశారు. శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి మాత్రమే పోలీసుశాఖ అనుమతులు ఇచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకులు ఇతర జిల్లాల నుంచి పెద్ద సం ఖ్యలో మందిని రప్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఏసీపీ తెలిపారు. పాదయాత్ర ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నదన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాదయాత్రను నిలిపి వేయాలని యాత్ర ప్రతినిధులకు నోటీసులిచ్చినట్టు ఏసీపీ తెలిపారు.
కరీంనగర్‌కు బండి సంజయ్ తరలింపు
అనుమతులు లేకుండా పాదయాత్ర శిబి రం వద్ద ధర్మదీక్షకు యత్నించిన బండి సంజయ్‌ని మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామునూర్ శివారులో పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందుజాగ్రత్త చర్య గా ఆయనను కరీంనగర్‌కు తరలించారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి కేసులో బీజేపీ కార్యకర్తలపై కేసులను నిరసిస్తూ ధర్మ దీక్ష చేపట్టాలని బండి నిర్ణయించారు. మరోపక్క కవిత ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ నగర మేయ ర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలలు పెద్దఎత్తున బండి యాత్రకు వచ్చే ఉప్పుగల్లుకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు పరిస్థితిని బండి సంజయ్‌కి వివరించి, అదుపులోకి తీసుకొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. బండి వెంట ఉన్న బౌన్సర్లు కార్యకర్తల రూపంలో కాషాయ కండువాలు కప్పుకొని తిరగబడేందుకు ప్రయత్నించినా పోలీసులు సంజయ్‌ను వాహనంలో కరీంనగర్ తరలించి, హౌస్ అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈ క్రమంలో జఫర్‌గఢ్ మండలం కూనూరులో టీఆర్ఎస్ నాయకుల వాహనాలపై బీజేపీ శ్రేణులు కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.
బండి ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ యత్నం
కార్పొరేషన్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని నిరసిస్తూ కరీంనగర్‌లోని బండి సం జయ్‌కుమార్ ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ నాయకులు మంగళవారం సాయంత్రం యత్నించారు. పెద్దసంఖ్యలో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు బండి ఇంటి వైపుగా దూసుకెళ్లారు. పోలీసులు వారిని గుర్తించి వెంటనే అడ్డుకున్నారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అంబులెన్స్‌ను ఆపేసి.. వాగ్వాదం
బీజేపీ కార్యకర్తల నిర్వాకం
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలో బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు వీ రంగం సృష్టించారు. అత్యవసరంగా వెళ్తు న్న అంబులెన్స్ కూడా అడ్డగించారు. దారి ఇవ్వాలని కోరినందుకు అంబులెన్స్ డ్రైవర్, రోగి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలు నీచ రాజకీయం కోసం ఓ నిండు ప్రాణంతో చెలగాటం ఆడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.