పటాన్చెరు/పటాన్చెరు రూరల్, జూలై 6: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో డీఎన్ఏ ఆధారంగా మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. కాగా మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. మరోపక్క పదుల సంఖ్యలో క్షతగాత్రులు వివిధ దవాఖానల్లో చికిత్సను పొందుతున్నారు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్టుగా ఆదివారం అధికారులు ప్రకటించారు. చికెన్సింగ్ అనే కార్మికుడి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోవడంతో గుర్తించి వారికి ఆదివారం అప్పగించారు. పటాన్చెరు దవాఖానలోని గుర్తుతెలియని రెండు మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులు, మరొకటి అఖిల్‌గా గుర్తించారు.
డీఎన్ఏ టెస్టుల కోసం 70 శాంపిళ్లను అధికారులు సేకరించారు. ఆ రిపోర్టులో మ్యాచ్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు మృతదేహాలు, లేదంటే వారి అవశేషాలను అప్పగించారు. పాశమైలారంలోని హెల్ప్‌డెస్క్ వద్ద మిస్సింగ్ అయిన 8 మంది కుటుంబాలకు చెందిన సభ్యులు వేచి చూస్తున్నారు. వివిధ రాష్ర్టాలనుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. పటాన్చెరు దవాఖానలోని పోస్టుమార్టం గదిని ఆదివారం కలెక్టర్ ప్రావీ ణ్య తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడే ఉన్న కార్మికుల కుటుంబాలను ఓదార్చారు. సిగాచి మృతుల సంఖ్య ఆదివారం నాటికి 42కు చేరినట్టు పేర్కొన్నారు. గల్లంతైన 8 మంది కార్మికుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. గాయపడిన 18 మందికి దవాఖానలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.