హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆర్ఎస్దేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. సోమవారం విశాఖలో జరిగిన స్టీల్‌ప్లాంట్ సభలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అదానీకి కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు పావులు కదుపుతున్నదని విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ శక్తులకు అప్పగించాలని మోదీ చూస్తున్నారని, ఇదేనా బీజేపీ సిద్ధాంతం? అని ప్రశ్నించారు. అదానీ బొగ్గు దిగుమతుల కోసం స్టీల్ ప్లాంట్ స్థలాలపై కన్నేశారని, అందులో భాగంగానే ప్రైవేటీకరణ నాటకానికి తెరతీశారని ధ్వజమెత్తారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5 వేలకోట్లు ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదా? అని నిలదీశారు. స్టీల్‌ప్లాంట్ ఆస్తులే సంస్థకు శ్రీరామరక్షని, అందుకే నిర్వాసితులు ఇచ్చిన భూముల్ని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణలో వైసీపీతోపాటు మిగిలిన పక్షాలు చేతులెత్తేశాయని, అందుకే ఆ బాధ్యతను బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు భుజాలకు ఎత్తుకున్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి అండగా నిలవాలని కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని, ఆయన వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నట్టు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలకు తోట ధన్యవాదాలు తెలిపారు.
అదానీ కోసమే విశాఖ ప్రైవేటీకరణ :సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
అదానీ బొగ్గు దిగుమతుల కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్నదని సీపీ ఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి మే 15 వరకు నిర్వహించే ‘బీజేపీ హటావో- దేశ్ బచావో’ పాదయాత్ర కరపత్రాన్ని ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాభాలను చూపించి, ప్రైవేటుపరం చేసేందుకే కేంద్రం వందేభారత్ రైలును తీసుకొచ్చిందని విమర్శించారు. ఓవైపు ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేసి, మరోవైపు ప్రజలసొమ్ముతో 100 ఎయిర్ పోర్ట్‌లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారని నిలదీశారు. 15 లక్షల కోట్ల ఆస్తులున్న బీఎస్ఎన్ఎల్కు కేవలం రూ.35 కోట్ల అప్పును కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. అదానీ బంగారు చిలుక అని.. కూపీలాగితే మోదీ, అమిత్‌షాలు బయటకు వస్తారని దుయ్యబట్టారు.