పాలకుర్తి( జనగామ) : తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. బుధవారం పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్ట్ మార్టం గదిని ప్రారంభించారు. అనంతరం రోగులకు పండ్లు , గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, ఎన్సీడీకిట్లను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ విడుదల చేసినహెల్త్ ఇండెక్స్ లో ఓవరాల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 3వ స్థానం, పురోగతిలో మొదటి స్థానం, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్లో తెలంగాణ నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వనప్పటికీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని తెలిపారు.
హైదరాబాద్ నిమ్స్(NIMS) ఆసుపత్రిలో అదనంగా రెండు వేల పడకలను పెంచడంతోపాటు హైదరాబాద్ నగరం చుట్టూ 4వేల 200 పడకల తో నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ(Multi Super Specialty ) ఆసుపత్రులను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్లో 11 వందల కోట్ల వ్యయంతో 24 అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. నూతనంగా ఏర్పడిన జనగాం జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరీ చేసి రూ.18 కోట్ల 70 లక్షలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 13 వేల 965 మంది లబ్ధిదారులకు కేసీఆర్ కిట్ల(KCR KITS)తో పాటు రూ.17 కోట్ల 58 లక్షల నగదును అందించామని చెప్పారు. 30,437 మందికి కంటి అద్దాలు అందించామని ఆయన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ తరహా ఆరోగ్య పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదని వెల్లడించారు. ఉత్తమ వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందిని మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్డీవో రాంరెడ్డి, డీఎంహెచ్వో ప్రశాంత్, ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.