హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా పలువురు చట్టసభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆమెను కలిసిన వారిలో ఉన్నారు.
కవితకు సంఘీభావం ప్రకటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఆమె నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని తప్పుపట్టారు. దాడుల సంస్కృతి మంచిదికాదని, బీజేపీ నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన వారిలో ఎమ్మెల్యే టీ రాజయ్య, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఎస్ రెడో చైర్మన్ సతీశ్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తదితరులు ఉన్నారు.