Harish Rao | ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. అందుకే గొంతు పెంచుకుని.. బిగ్గరగా మాట్లాడి.. నేనున్నానే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గొంతు పెంచినా.. అరిచినా.. గీపెట్టినా.. అల్లరి చేసినా.. రెండు గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ఎల్పీలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పని అయిపోయిందని అన్నారు. నీ చేతలతో చేయాలి తప్ప.. నీ మాటల గారడీతో ప్రజలను నమ్మించలేవని స్పష్టం చేశారు.
ఒక్క స్కూల్ అయినా కట్టారా అని ఇష్టమొచ్చినట్లు ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడారని హరీశ్‌రావు అన్నారు. ఏ నియోజకవర్గానికి పోదాం.. కట్టిన గిరిజిన గురుకులాలు చూపిస్తాం.. మన ఊరి మన బడి పాఠశాలలు చూపిస్తాం.. ఇవాళ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో.. ఏ నియోజకవర్గానికి వెళ్లినా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఫార్మా సిటీకి విలువైన భూములు సేకరించి.. అగ్గువకే మేం భూములు కేటాయించామని రేవంత్ రెడ్డి అంటున్నారని ప్రస్తావించారు. దీనిపై రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఫార్మా సిటీలో ఏ ఒక్క కంపెనీకి అయినా.. ఒక్క ఎకరమైనా కేటాయించామా అని ప్రశ్నించారు. కేటాయిస్తే ఎవరికి కేటాయించామో చెప్పాలని నిలదీశారు. కేటాయించిందే లేదు.. అగ్గువకే కేటాయించామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ఆడటానికి సిగ్గు ఉండాలని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్‌లోనూ అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మాకేమో మైక్ ఇవ్వరు.. సభా నాయకుడివి అని నీకు మైక్ ఇస్తే.. నోటికొచ్చినట్లు సొల్లు వాగి వెళ్లిపోయావని ఎద్దేవా చేశారు.
రుణమాఫీ చేయవద్దని.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వద్దని బీఆర్ఎస్ అంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. మాట్లాడటానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభో అని ముఖ్యమంత్రికి పలుసార్లు లెటర్లు రాసినం.. అసెంబ్లీలో మాట్లాడినం అని గుర్తుచేశారు. రుణమాఫీ వద్దని, ఫీజు రీయింబర్స్మెంట్ వద్దని.. ఆర్ఆర్ఆర్ వద్దని.. సాగునీటి ప్రాజెక్టులు వద్దని బీఆర్ఎస్ చెప్పిందని ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చోర్ ఉల్టా.. కొత్వాల్‌కే డాంటే అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని విమర్శించారు. ఇయ్యనిది నువ్వు.. ఎగ్గొట్టింది నువ్వు.. ఇయ్యి మహాప్రభో అని రోజు వెంటపడుతుంది మేము అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ముఖ్యమంత్రి చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ ఖతమవుతుందని అన్నారు. నీ గ్రాఫ్ ఏడాది పాలనలో పూర్తిగా పడిపోయిందని విమర్శించారు. అందుకే గొంతు పెంచుకుని, బిగ్గరగా మాట్లాడి.. నేను ఉన్నానని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావని అన్నారు. గొంతు పెంచినా.. అరిచినా.. గీపెట్టినా.. అల్లరి చేసినా.. రెండు గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరని రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. నీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. చేతలతో చేయాలి తప్ప.. నీ మాటల గారడీతో ప్రజలు నమ్మరని అన్నారు. 2లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇవ్వలేదు.. రైతు భరోసా మీద క్లారిటీ ఇవ్వలేదు.. ఇవాళ నువ్వు చెప్పిందేంటని మండిపడ్డారు. పంటల బీమాపై తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేసిండని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 11 కి.మీ.కు పైగా తవ్వామని అప్పటి ఇరిగేషన్ మంత్రిగా చెబుతున్నానని హరీశ్‌రావు అన్నారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు పండించి చూపించామని స్పష్టం చేశారు. నిన్న గాక మొన్న రేవంత్ రెడ్డి నల్గొండ వెళ్లి ప్రారంభించిన ఉదయసముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. నువ్వు ప్రారంభించిన మెడికల్ కాలేజీ కట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. నల్గొండ పోదామా? ఆలేరు పోదామా? భువనగిరి పోదామా? అని ముఖ్యమంత్రి అంటున్నారు.. కచ్చితంగా పోదామని హరీశ్‌రావు అన్నారు. ఈ మూసీ బాధలకు కాంగ్రెస్, టీడీపీ కాదా.. పోయి అడుగుదామని సవాలు విసిరారు.
50 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏండ్ల టీడీపీ పాలనలోనే నల్గొండ, ఆలేరు, భువనగిరి ప్రజల బతుకులు ఆగమయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. దాన్ని బాగు చేసే పనిని తాము చేపట్టామని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి మూసీలోకి మురుగునీరు పోకుండా.. ఎస్టీపీలు చేపట్టింది బీఆర్ఎస్ అని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. గన్‌మెన్ లేకుండా లగచర్ల వస్తా అని అన్నావు కదా.. అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడదామని సవాలు విసిరారు. మూసీ ఎక్కడైతే ప్రారంభమవుతుందో.. అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దామని అన్నారు. తేదీ చెబితే మేం కూడా వస్తాం.. ఎన్ని రోజులు నడుద్దామో నడుద్దాం పదా అని సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ వేశారు. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడటం కాదని అన్నారు.