హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించడంతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించింది. హైదరాబాద్‌లోని అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్‌రెడ్డి పాల్గొని కాకతీయ వర్సిటీ (కేయూ) విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబసభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం పొన్నం మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే సంక్షేమ సంసరణలను రూపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ భేటీలో విద్యార్థి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబసభ్యులు చేసిన సూచనలు, ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పొందుపరుస్తామనిచెప్పారు. సోమవారం సమావేశంలో రసాభాసతో చైర్మన్ కేకే మంగళవారం భేటీకి గైర్హాజరయ్యారు. కాగా సచివాలయం ఎదుట ఉన్న తెలంగాణ అమర జ్యోతి ప్రాంగణాన్ని సమావేశాలకు అధికారిక వేదికగా ఖరారు చేసింది. కాగా, జూలై 6 నుంచి 22 వరకు ఉమ్మడి జిల్లాల సమీక్షలు నిర్వహించనున్నారు.