హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మూలాలు ఉన్నవాళ్లనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అసోసియేషన్ సోమవారం అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. హై కోర్టు న్యాయమూర్తుల నియామకాలు తెలంగాణవారితోనే చేయాలని అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది.
న్యాయమూర్తి నియామకాలకు సంబంధించి కొలీజియం ప్రతిపాదనల అంశంపై హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన అసాధారణ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్, సుప్రీంకోర్టు కొలీజియంలోని న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖమంత్రి, గవర్నర్, సీఎం, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు వినతిపత్రాలు ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఈనెల 17న మధ్యాహ్నం హైకోర్టులో నిరసన చేపట్టాలని తీర్మానించింది. ఈ విషయాన్ని అసోసియేషన్ కార్యదర్శి కే నిరంజన్‌రెడ్డి పేరొన్నారు.