Telangana | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు కృషితో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. అవయవ మార్పిడుల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. బ్రెయిన్ డెడ్ లేదా మరణించిన తర్వాత అవయవాలను సేకరించి.. మరికొంత మందికి జీవితాలను ఇవ్వడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2022లో మరణించినవారి నుంచి సేకరించి అత్యధిక అవయవ మార్పిడులు చేసిన రాష్ట్రంగా తెలంగాణ సత్తాచాటింది. గతేడాది దేశవ్యాప్తంగా డిసీజ్డ్ ట్రాన్స్ప్లాంట్లు 2,765 జరిగాయి. ఇందులో తెలంగాణలోనే 655 జరుగడం విశేషం. 24 శాతం ట్రాన్స్ప్లాంట్లు అంటే దేశవ్యాప్తంగా ప్రతి నాలుగు సర్జరీల్లో ఒకటి తెలంగాణలోనే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, పటిష్టంగా అమలవుతున్న జీవన్‌దాన్ కార్యక్రమం ఫలితంగానే ఇది సాధ్యమైంది.
రాష్ట్ర ప్రభుత్వం అవయవ మార్పిడులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకొంటున్నది. జీవన్‌దాన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నది. పైరవీలకు ఎక్కడా తావులేకుండా..ఆస్తులు, హోదాలతో సంబంధం లేకుండా అందరికీ వరుస క్రమంలోనే అవయవ మార్పిడులు జరుగుతుండడం విశేషం. భారీ వ్యయం అయ్యే ఈ చికిత్సలను పూర్తి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్నది. వారికి జీవితాంతం అయ్యే మందుల ఖర్చును కూడా భరిస్తున్నది. ప్రసుత్తం నిమ్స్, ఉస్మానియా దవాఖానల్లో అవయవ మార్పిడులు జరుగుతున్నాయి. ఇందుకోసం రెండు దవాఖానల్లోనూ అత్యాధునిక వసతులను కల్పించింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో బ్రెయిన్ డెడ్‌ను నిర్ధారించేందుకు చర్యలు చేపట్టింది. ఫలితంగా జిల్లాల్లోనే బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారిస్తే మార్పిడుల సంఖ్య పెరుగనున్నది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
అవయవ మార్పిడుల్లో తెలంగాణ టాప్‌లో నిలిచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం, అనేక విభాగాల కృషి ఉన్నది. పోలీస్ విభాగం గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి అవయవాలను తరలించేందుకు సహకరిస్తున్నారు. దవాఖానలో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయినప్పటి నుంచి అవయవాలను మరొకరి శరీరంలో అమర్చి సర్జరీ పూర్తయ్యే వరకు పదుల మంది వైద్యులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. జీవన్‌దాన్ ద్వారా దాతల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కోఆర్డినేటర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఒకవేళ అవసరమైతే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేరుగా దాతల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పిస్తున్నారు.
– డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ కోఆర్డినేటర్
P