హైదరాబాద్,జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. షాబాద్‌లో జరిగిన ఘటన, అనంతర పరిణామాలతో ఆ విషయం మరింత తేటతెల్లమైంది’ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. దీనికి బాధ్యత వహించి సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఘోర ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అక్రమంగా అడ్డుకొని, అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దైవాలగూడలో ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో చేతకాని ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు.
నేడు తెలంగాణ రాష్ట్రం పోక్సో కేసులకు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మేమేమైనా నేరస్తులమా? బాధితులను పరామర్శించడం చట్టవిరుద్ధమా?‘ అని పోలీసులను నిలదీశారు. బాధితులను ఓదార్చడానికి వెళ్తున్న తనతోపాటు మాజీ మంత్రి పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు శంకర్పల్లి వద్ద అక్రమంగా నిర్బంధించి, అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆరుగురిని పాశవికంగా పొట్టనబెట్టుకొన్న ప్రధాన నిందితుడు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే, వాడిని పట్టుకోలేని ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై జైలుకు పంపుతున్నదని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ చేతగాని పనితీరుకు నిదర్శనమని, ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. దైవాలగూడ నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని లేదా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థికసాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నిందితులపై ఉదాసీనత
పోక్సో చట్టం కింద నమోదైన తీవ్రమైన కేసుల్లో నిందితుల పట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. మే 16న ఒక మైనర్‌పై జరిగిన దారుణానికి సంబంధించి నిందితుడు రాజ్‌కుమార్‌పై సెక్షన్ 78, 351తో పాటు పోక్సో యాక్ట్ సెక్షన్ 11 కింద పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, స్టేషన్ బెయిల్ వచ్చే బలహీనమైన సెక్షన్లనే నమోదు చేశారని ఆరోపించారు. కేసు పెట్టినప్పటి నుంచి పోలీసులు నిందితుడిని కనీసం స్టేషన్‌కు కూడా పిలువలేదని, కనీసం కౌన్సెలింగ్ సైతం ఇవ్వలేదని తెలిపారు. బాధితులకు ప్రాణభయం ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫలితంగానే ఆరుగురు అమాయకులు దారుణ హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ హత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగాయని ఆయన స్పష్టంచేశారు.
గతంలో పోక్సో కేసు నిందితుడైన బండి భగీరథ్‌ను 9 రోజులపాటు అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వమే కాపాడిందని విమర్శించారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోనే ఈ దారుణ ఉదంతం చోటుచేసుకొన్నదని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖండించారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ మహిళా నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని, దీనికి బాధ్యతగా పర్యటనల్లో విహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హైదరాబాద్ రాజ్‌భవన్‌కు చేరుకొని గవర్నర్‌కు రాజీనామా లేఖను అందించాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసు బాధితుల భయాందోళనలు
పేట్ బషీరాబాద్ పోక్సో కేసు బాధితులు శనివారం తనను కలిసి భయాందోళన వ్యక్తంచేశారని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ‘షాబాద్ కేసులో పోక్సో నిందితుడు బయటకొచ్చి ఆరుగురిని చంపాడు.. మాపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు కూడా బయటే ఉన్నాడు, మమ్మల్ని కూడా చంపుతాడేమోనని భయంగా ఉన్నది‘ అని సదరు బాలిక, ఆమె తల్లి కన్నీరుమున్నీరయ్యారని పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ కేసులో బండి సంజయ్ కొడుకును కాపాడటానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేశారని ఆరోపించారు. నిందితుడికి రహస్యంగా మధ్యంతర బెయిల్ ఇప్పించారని మండిపడ్డారు.
బాధితురాలి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడని, అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థ లూథ్రా వంటి పెద్ద లాయర్లను తెచ్చి ప్రభుత్వం ఎందుకు బెయిల్ అడ్డుకోలేదని అడిగారు. బాధితులపై పెట్టిన ఫేక్ హనీ ట్రాప్ కేసును ఇప్పటికీ ఎందుకు కొట్టేయలేదని ప్రశ్నించారు. పోక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సభ్యసమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కడారి స్వామియాదవ్ తదితరులు పాల్గొన్నారు.