హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): ‘సాధనాత్ సాధ్యతే సర్వం’ (సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు) అనే సూక్తికి ప్రతీక వాల్మీకి మహర్షి అని, ఒక సామాన్యుడు మహర్షిగా ఎదిగిన ఆయన జీవితమే అందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీర్తించారు. ఆదివారం మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఆయన ఔన్నత్యాన్ని, పాదుకొల్పిన విలువలను సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు. భారతీయ సామాజిక తాత్వికత, కుటుంబ బాధ్యతలు, ప్రజాపాలకుని త్యాగనిరతికి వాల్మీకి రచించిన రామాయణం ప్రామాణికమని శ్లాఘించారు. ఉన్నతమైన ఆదర్శాలు, మానవతా విలువల బోధనలను రామాయణం ద్వారా లోకానికి రమణీయంగా అందించి, ఆదికవిగా వాల్మీకి నిలిచారని సీఎం కొనియాడారు. సీతారాముల జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన రామాయణాన్ని మధుర కావ్యంగా, మహాకావ్యంగా లోకం అదరిస్తున్నదని గుర్తుచేశారు.