ఏటూరు నాగారం, ఆగస్టు 25: ఆయన కాంగ్రెస్ నేత.. కానీ దళితుడు. వేరే పార్టీ అయితేనేం.. దళితులంతా ఎదగాలన్న సంకల్పంతో ఆయనకూ టీఆర్ఎస్ సర్కారు దళితబంధు పథకాన్ని వర్తింపజేసింది. ఏటూరు నాగారానికి చెందిన సాదనపల్లి లక్ష్మయ్య కాంగ్రెస్ మండల స్థాయి నేత. వేరే పార్టీ అయినా, లక్ష్మయ్య ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దళితబంధు కింద రూ.10 లక్షలు అందజేసింది. ఆ డబ్బుతో శ్రీసాయిరాం స్టీల్, సిమెంట్ పేరుతో దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని, గురువారం దాన్ని ప్రారంభించారు. ఒక్క లక్ష్మయ్యే కాదు.. ములుగు నియోజకవర్గంలో దాదాపు 80 మంది కాంగ్రెస్ నేతలకు దళితబంధు అందింది. నియోజకవర్గంలో తొలి విడతలో 120 మందికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఇందులో 100 మంది వరకు రవాణా వాహనాలు పొందారు. మిగిలిన 20 మంది స్టీల్, సిమెంట్, టెంట్‌హౌజ్, డీజే, కిరాణం, ఆటోమొబైల్స్ దుకాణాలను ఏర్పాటు చేసుకొన్నారు. విశేషమేమిటంటే.. ఏటూరు నాగారంలోని లబ్ధిదారులంతా కాంగ్రెస్‌కు చెందినవారే.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
నాకు ఎలాంటి ఆస్తులు లేవు. భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నిరుపేదనైన నన్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దళితబంధు పథకాన్ని వర్తింపజేసింది. స్టీల్, సిమెంట్ దుకాణం పెట్టుకొన్నా. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకొనే అవకాశం లభించింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ఎస్ లక్ష్మయ్య, ఏటూరునాగారం