హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు.
షెడ్యూల్ విడుదలతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడవు ముగియనుంది. ఈ నెల 31న స్క్రూటినీ నిర్వహించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 1న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. అదేరోజు అభ్యర్థులు తుది జాబితా ప్రకటించనున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల 43 వేల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.
నామినేషన్లు ప్రారంభం – జనవరి 28
నామినేషన్లకు గడువు – జనవరి 30
నామినేషన్ల స్క్రూటినీ – జనవరి 31
నామినేషన్లు ఉపసంహరణ – ఫిబ్రవరి 3
పోలింగ్ – ఫిబ్రవరి 11
కౌంటింగ్ – ఫిబ్రవరి 13
పోలింగ్ కేంద్రాలు – 8,195
పోలింగ్ టైమ్ – ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు