హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పీఎం కుసుమ్ పథకం కింద రైతులు ఏర్పాటు చేసే సోలార్ విద్యుత్తు ప్లాంట్ల కిల్వాట్ ధరకు కోతపెట్టబోతున్నారు. రైతులు ఏర్పాటు చేసుకున్న ప్లాంట్ల నుంచి డిస్కమ్‌లు కొనుగోలు చేయడంలో భాగంగా ఒక కిలోవాట్ ధర ఇది వరకు రూ. 3.13గా ఖరారుచేయగా, దీన్ని రూ. 2.98కి తగ్గించబోతున్నారు.
ధరల సవరణకు అనుమతి కోరుతూ డిస్కమ్‌ల తరఫున దక్షిణడిస్కమ్ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి పిటిషన్ సమర్పించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 30 వరకు అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు. జూలై 8న ఈ పిటిషన్‌పై ఈఆర్సీ బహిరంగ విచారణ జరుపనున్నది. ముందు రూ. 3.13గా ఖరారుచేసి, ఏకంగా 15 పైసలు తగ్గించబోతున్నారు. ప్లాంట్ల ఏర్పాటు ముందు ఒక ధర చెప్పి.. ఇప్పుడు తగ్గించనుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో నెలకు రూ. 40వేల ఆదాయం తగ్గుతున్నదని రైతులు వాపోతున్నారు.