అరవై ఏండ్లు సమస్త రంగాల్లోనూ ధ్వంసమైన తెలంగాణ.. పదేండ్లలో సమ్మిళిత ప్రగతితో మెరవడమే.. కేసీఆర్ చేసి చూపించిన తెలంగాణ మాడల్! ప్రజా సంక్షేమం, ప్రగతి జోడెడ్లలా సాగడమే తెలంగాణ మాడల్! అత్యంత పిన్నవయసు రాష్ట్రమైనా.. అనేక రంగాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం, పెద్ద రాష్ర్టాలే కాదు, కేంద్ర ప్రభుత్వమూ పలు పథకాలను పేరుమార్చి అమలు చేయడం కండ్లారా చూశాం. అదీ అసలైన రైజింగ్! ‘గుజరాత్ మాడల్’ను సాధిస్తామంటూ బయల్దేరినవాళ్లకు ‘తెలంగాణ మాడల్’ విలువ తెలుసా?దటీజ్ తెలంగాణ మాడల్..!
(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ) ; ప్రతి పథకం ఒక చరిత్ర. ప్రతి అడుగు ఒక విప్లవం. ప్రతి నిర్ణయం ఒక సంచలనం. దేశంలో 29వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ.. కేసీఆర్ సర్కారు పాలనలో సమ్మిళితాభివృద్ధిని సాధించింది. దేశం అసాధ్యం అనుకొన్న ప్రతి పనినీ తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించింది. పౌరుల ఆదాయం, కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలు, విద్యుత్తు, వ్యవసాయం, సంక్షేమం.. ఇలా పది అంశాల్లో దశాబ్దాలుగా పెద్ద రాష్ర్టాలు సాధించలేని ఎన్నో ఘనతలను సాధించింది. అందుకే నీతిఆయోగ్ వంటి మేధోసంస్థలతోపాటు ప్రముఖుల చేత ‘తెలంగాణ మాడల్ సక్సెస్’ అంటూ నీరాజనాలు అందుకొన్నది.