హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఏటేటా పడిపోతున్నాయి. సరైన రవాణా సదుపాయం లేక, ఇతరేతర కారణాలతో ఆ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు. రా్రష్ట్రంలో 194 మాడల్ సూళ్లు ఉండగా, 1.59 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది 1.1 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. దాదాపు 58 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2017లో రికార్డుస్థాయిలో 1.36 లక్షల సీట్లు నిండాయి. ఆ తర్వాత నుంచి ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. టేకురి (ఇల్లందకుంట), జవహర్నగర్ (వెంకటాపూర్), పెద్దేముల్, కరివిరాల (నడిగుడెం), గంగారం (కాటారం), కొడిమ్యాల (జగిత్యాల) మాడల్సూళ్లలో అతి తక్కువ ఎన్రోల్మెంట్ నమోదైంది. మాడల్ స్కూళ్లపై గురుకులాల అడ్మిషన్ల ప్రభావం కూడా పడుతున్నది. గురుకులాల్లో వసతి, మంచి మెనూ అమలుచేయడం, మాడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే ఉండటంతో విద్యార్థులు గురుకులాల వైపై చూస్తున్నారు. గురుకులాల్లో 5వ తరగతిలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అదే మాడల్ స్కూళ్లలో 6వ తరగతిలో చేర్చుకుంటున్నారు. అంటే గురుకులాల్లో చేరగా మిగిలిన విద్యార్థులను మాడల్ స్కూళ్లు.. ఇటూ జిల్లా పరిషత్, ప్రభుత్వ బడులు, పంచుకోవాల్సి వస్తున్నది. ఇది కూడా అడ్మిషన్లు తగ్గేందుకు ప్రధాన కారణమని తెలంగాణ మాడల్ స్కూల్స్ టీచర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు పేర్కొన్నారు. మాడల్ స్కూళ్లలో ఇంటర్ చదువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను కాకుండా డిమాండ్ లేని ఎంఈసీ, సీఈసీ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరాలనుకునే వారు 10వ తరగతి తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోతున్నారు. ఇది కూడా అడ్మిషన్లపై ప్రభావం పడుతున్నది.
ఇంగ్లిష్ మీడియం చదువులు, నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మాడల్ స్కూళ్లను రవాణా సమస్య పట్టిపీడిస్తున్నది. స్కూళ్లు దూరంగా, మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో రాకపోకలు అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది. ఈ బడులకు రవాణా సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రానుపోను కష్టంగా మారడంతో ఏకంగా అడ్మిషన్లు రద్దుచేసుకుంటున్నారు. మరకొందరు ఆటోలు, వ్యాన్ల వంటి ప్రైవేట్ రవాణాపై ఆధారపడుతున్నారు. వాటికోసం విద్యార్థుల తల్లిదండ్రుల నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనపు భారం పడుతున్నది. దీంతో ఆ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. మాడల్ స్కూళ్ల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని కోరుతూ ఆర్టీసీకి లేఖరాయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. కనీసం రెండు, మూడు బస్సులను నడిపితేనే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని టీచర్లు అంటున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో ప్రధాన రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో మాడల్ స్కూల్ ఉన్నది. సమీప గ్రామాల విద్యార్థుల్లో కొందరు ఆర్టీసీ బస్సు వస్తేనే బడికి వెళ్తున్నారు. బస్సు రాకపోతే ఆ రోజు బడి బంద్ అయినట్టే.