హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇక నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, కౌటింగ్ ఘట్టాలు మిగిలాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను ఈ ఓట్లే ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో తమకంటే తక్కువ ఓట్లు సాధించే అవకాశమున్నవారితో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు మీరు వేయించుకోండి. రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు తనకు వేయించాలంటూ ఇతర అభ్యర్థులతో మాట్లాడుకుంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి, రెండు, మూడు అన్న అంకెలను ప్రాధాన్యతాక్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపులో తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కన్నా ఒక ఓటు అధికంగా ఎవరికీ రాని పక్షంలో వరుసగా.. రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మల్క కొమురయ్య(తపస్-బీజేపీ), వంగ మహేందర్‌రెడ్డి(పీఆర్టీయూటీఎస్), తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి(సీపీఎస్ఈయూ), ఎం సుధాకర్‌రెడ్డి, అశోక్‌కుమార్(టీపీటీఎఫ్)లతోపాటు మరికొందరు పోటీచేస్తున్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో పింగిలి శ్రీపాల్‌రెడ్డి(పీఆర్టీయూటీఎస్), పూల రవీందర్(జాక్టో), ఏ నర్సిరెడ్డి(యూటీఎఫ్), పులి సరోత్తంరెడ్డి(తపస్-బీజేపీ), హర్షవర్ధన్‌రెడ్డి సహా మరికొందరు నామినేషన్లు దాఖలు చేశారు.