వరంగల్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యువతులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఒక బృందం వేయి స్తంభాల గుడిని, ఖిలా వరంగల్‌ను సందర్శించింది. కేసీఆర్ హయాంలో యునె స్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని మరో బృందం సందర్శించింది. యువతుల పర్యటన నేపథ్యంలో రామప్ప గుడి, వేయి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్‌తోపాటు నగరాన్ని సుందరంగా అలంకరించారు.
వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన 20 దేశాలకు చెందిన అందగత్తెల బృందం కాకతీయుల శిల్పకళను, కట్టడాలను తనివితీరా తిలకించి అబ్బుర పడింది. ఆలయ విశిష్టత, చరిత్రను గైడ్లు వారికి వివరించారు. పట్టుచీరలు, పట్టు పరికీణలు, నుదుటన బొట్టుతో తెలంగాణ అమ్మాయిల్లా రామప్ప పరిసరాల్లో అందగత్తెలు సందడి చేశారు. మంత్రి సీతక్క సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించారు. రాణీ రుద్రమదేవి వేషధారణలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజరి ఆధ్వర్యంలో కాకతీయ రాజు ల పరిపాలన అంశాలను నృత్య రూపంలో వివరించారు. రంజిత్ పేరిణి నృత్య కళా బృందం 65 మంది పేరిణి కళాకారులతో సత్యం శివం సుందరం, శివ తాండవం ప్రదర్శనను లైట్ అండ్ సౌండ్ షోతో ప్రదర్శించింది.