అంగన్వాడీల్లో ఏమిస్తున్నారో చూశారా?
ఉత్తమ్‌కుమార్ పనికిమాలిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి స్మృతి పసలేని జవాబు
పార్లమెంటు సాక్షిగా బాధ్యతారాహిత్యం
టీఆర్ఎస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలనే బద్నాం చేస్తున్నారు
మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 3 : తెలంగాణలో అమలవుతున్న మహిళాశిశు పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విషయంలో పార్లమెంటును తప్పుదోవ పట్టించినందుకు స్మృతి ఇరానీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పార్లమెంటులో తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అదేపనిగా బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రం లో గర్భిణులు, బాలింతలకు అమలుచేస్తున్న పోషకాహారానికి సంబంధించిన ఆహారధాన్యాలు ఒక్క అంగన్వాడీ కేంద్రానికి కూడా అందడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంగన్వాడీలలో ఎప్పుడూ గోధుమలు ఇవ్వలేదని, గోధుములతో కలిపి ఇతర పోషక పదార్థ్ధాలతో బాలామృతం తయారుచేస్తున్నామని వెల్లడించారు. దీని గురించి స్మృతి ఇరానీని కలిసి స్వయంగా లేఖ ఇచ్చానని తెలిపారు. బాలామృతాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేయాలని స్మృతి సూచించారని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం పథకం అమలుపై విచారణ చేస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాలామృతాన్ని ఎన్ఐఎన్, ఇక్రిశాట్, నీతి అయోగ్ భాగస్వామ్యంతో శాస్త్రీయంగా పరీక్షలు చేసి తయారు చేశామని వెల్లడించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి తన పార్లమెంటు పరిధిలో ఏం జరుగుతున్నదో కనీస పరిజ్ఞానం లేకుండా ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన గోధుములను సరైన సమయంలో ఇవ్వాలని డిమాండ్‌చేశారు. గర్భిణులు, బాలింతల కోసం ఎన్ఐఎన్, యూనిసెఫ్, ఇక్రిశాట్ సహకారంతో గిరి పోషణను అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల అదనంగా మరో 10 జిల్లాల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం అదనంగా కోటా ఇవ్వకపోయినా, సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు బడ్జెట్లో కేటాయించారని తెలిపారు.
వెనుకబడిన జిల్లాలకు మంచి పోషకాహారాల కోసం లేఖ రాస్తే రెండు జిల్లాలకే ఇచ్చారని చెప్పారు. గిరిపోషణ పథకానికి ఈ నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి సత్యవతి తెలిపారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి దేశంలోనే ప్రత్యేకమైన కార్యక్రమమని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే జీతంలో కేంద్రం నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం వారికి రూ.13,650 ఇస్తున్నదని తెలిపారు. ఐసీడీఎస్‌పై కేంద్రానికి ఒక విధానం అంటూ లేదని, త్వరలోనే తెలంగాణ ఒక విధానాన్ని తీసుకొస్తున్నదని చెప్పారు. గతంలో వరర్లు అని పిలిచే వాళ్ళను టీచర్లనే హోదాను సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్టు తెలిపారు.
స్మృతి ఇరానీ క్షమాపణ చెప్పాలి: పల్లా
పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెంటనే క్షమాపణ చెప్పాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రులు అబద్ధాలు చెప్తున్నారన్నారు. గోబెల్స్ వారసత్వాన్ని బీజేపీ కేంద్రమంత్రులు కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రశ్నలు అడిగేవారికి కూడా సోయి ఉండట్లేదని అన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ మహిళలకు తెలంగాణ చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. స్మృతిఇరానీ ఎప్పుడైనా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళారా? అని ప్రశ్నించారు.