హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ):మంత్రుల మాట: బాయిల్డ్ రైస్ కొనబోం.. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటాం.. ఇదీ నిజం: తెలంగాణ నుంచి రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటామని చెప్తున్న కేంద్ర మంత్రులు.. దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ఎందుకు జంకుతున్నరు. ఇందుకోసం రాష్ట్రం ఎన్నిసార్లు డిమాండ్చేసినా ఎందుకు స్పందించడంలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం మెడపై కత్తిపెట్టి మరీ బాయిల్డ్ రైస్ ఇవ్వొద్దని రాయించుకొన్నారు. మరి ఎంత కొంటరో రాతపూర్వకంగా ఇవ్వడానికి నిరాకరించడం వెనుక మతలబు ఏమిటి? బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పినట్టే భవిష్యత్‌లో రా రైస్ కూడా తీసుకోబోమని చెప్పరని గ్యారంటీ ఏమిటి?
ఇదీ నిజం: రాష్ట్ర ప్రభుత్వం వానకాలం ధాన్యం సేకరణ గురించి అడుగుతుంటే.. కేంద్రమేమో గత యాసంగి సీఎమ్మార్ గురించి మాట్లాడుతున్నది. ధాన్యంపై రాష్ట్రం చేస్తున్న డిమాండ్లకు.. కేంద్రం చెప్తున్న మాటలకు పొంతనలేదు. ‘వానకాలంలో మీరిచ్చిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ పూర్తయింది. మరో 30 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశముంది. ఈ మిగిలిన ధాన్యాన్ని కొంటరా లేదా? చెప్పండి’ అని తెలంగాణ మంత్రులు స్పష్టంగా అడుగుతున్నరు. ఏడాదిలో తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో టార్గెట్ ఇవ్వండని డిమాండ్ చేస్తున్నరు. కానీ కేంద్ర మంత్రులు అసలు సమస్యకు పరిష్కారం చెప్పకుండా.. లేని సమస్యను ముందుకు తెచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు.
ఇదీ నిజం: యాసంగిలోనూ బాయిల్డ్ రైస్‌కు బదులు రా రైస్ ఇవ్వాలని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్‌రెడ్డి సూచిస్తున్నారు. అదెలా సాధ్యం? తెలంగాణలో యాసంగిలో పండేదే బాయిల్డ్ రైస్ అని స్వయంగా కిషన్‌రెడ్డే ఇదే మీడియా సమావేశంలో ఒప్పుకొన్నారు. అలాంటిది మళ్లీ రా రైస్ ఇవ్వాలని అడగడమేమిటి? అంటే కిషన్‌రెడ్డి ఆత్మను చంపుకొని అబద్ధాలు చెప్తున్నారనేది తేలిపోయింది. యాసంగిలో బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఇవ్వాలంటే ధాన్యం 50 శాతానికి పైగా నూక అవుతుంది. ఈ లోటు పూడ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుంది. గతంలో బాయిల్డ్ రైస్‌ను పనిగట్టుకొని ప్రోత్సహించిన కేంద్రం.. ఇప్పుడేమో రా రైస్ అంటూ మెలికలు పెడుతున్నది.మంత్రుల మాట: యాసంగిలో బాయిల్డ్ రైస్ రాష్ట్రమే కొనుగోలు చేయాలి.
ఇదీ నిజం: ఇది మరీ విచిత్రం. కిషన్‌రెడ్డి అంటున్నట్టు యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనడం రాష్ర్టానికి ఎలా సాధ్యమవుతుంది? బాయిల్డ్ రైస్‌ను కొని రాష్ట్రం ఏం చేసుకోవాలి? మనదగ్గర వినియోగం లేదు. ఎగుమతికి అధికారం లేదు? మరి ఏం చేయాలి?
ఇదీ నిజం: కేంద్ర మంత్రులు నోటికి ఎంతొస్తే అంత అబద్ధాలాడుతున్నారు. వాస్తవం ఏమిటంటే ఇప్పటివరకు ఒకసారి మాత్రమే గడువు పొడిగించారు. 62 లక్షల టన్నుల బియ్యం (సీఎమ్మార్) ఇచ్చేందుకు గడువును నవంబర్ చివరి నుంచి డిసెంబర్ చివరికి పొడిగించారు. ఇప్పటికే 80 శాతం వరకు సీఎమ్మార్ అందించింది. మిగిలింది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎఫ్‌సీఐ రైల్వే వ్యాగన్లు, గోదాముల్లో స్టోరీజీ స్పేస్ చూపించడం లేదు. ఎఫ్‌సీఐ గోదాముల ముందు బియ్యం లోడ్ లారీలు రోజుల తరబడి బారులు తీరిన పరిస్థితి వాళ్లకు కనిపించడం లేదా?
మంత్రుల మాట: కేంద్ర అవసరాలకు అనుగుణంగానే బియ్యం తీసుకుంటాం.
ఇదీ నిజం: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను ఎందుకు నిరాకరిస్తున్నామనే విషయాన్ని కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. తమది పక్కా కమర్షియల్ అని చెప్పకనే చెప్పారు. కేంద్రం అవసరాల మేరకే రాష్ర్టాల నుంచి ధాన్యం కొంటామన్నారు. కేంద్రం.. ప్రభుత్వంలా కాకుండా ప్రైవేటు వ్యాపారిలా ఆలోచిస్తుండటం గమనార్హం.
ఇదీ నిజం: ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకేముంది. గత యాసంగిలో మిగిలిన బాయిల్డ్ రైస్ తీసుకోవాలంటే.. వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసివ్వాలని లిఖితపూర్వకంగా అడగటాన్ని కేంద్ర మంత్రులు కావాలనే మర్చిపోయినట్టున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ తోనే ఈ విషయాన్ని ఆనాడు కేంద్రమంత్రులు చెప్పారు. ఇప్పుడేమో సుద్దులు మాట్లాడుతున్నారు. ‘గత యాసంగిలో మిగిలిన బాయిల్డ్ రైస్‌ను తీసుకోవాలంటే.. వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమనే షరతుకు అంగీకరించి రాసివ్వండి’ అంటూ చెప్పింది కేంద్ర మంత్రులు కాదా? ఇది మెడపై కత్తిపెట్టి రాయించుకోవడం కాకపోతే ఏమిటీ? ఈ విషయం కిషన్‌రెడ్డికి తెలియదా?
ఇదీ నిజం: మధ్యవర్తిగా ఉన్నందుకు ప్రతి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై సుమారు రూ. 3-5వేల కోట్ల వరకు నష్టపోతున్నది. బ్యాంకులో వడ్డీ చెల్లించేందుకు, హమాలీలకు, గోనె సంచులకు, ఇతర ఖర్చులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తున్నది. ఈ విషయం వారికి తెలిసినా.. రాష్ర్టాన్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నారు.
ఇదీ నిజం: ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్రమే కొనాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తున్నారు. వాస్తవానికి ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.. రాష్ర్టానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్రం కేవలం మధ్యవర్తి మాత్రమే. మోదీ సర్కారు వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకున్నది నిజం కాదా? కేంద్రం.. తాను నిర్వహించాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని ఇప్పుడు రాష్ట్రంపై నిందలు వేస్తున్నది.
ఇదీ నిజం: ఎఫ్‌సీఐ గోదాముల వద్దకు వచ్చిన బియ్యంను తీసుకొంటున్నామని, ఎవర్నీ వెనక్కి పంపించలేదని, సీఎమ్మార్ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కిషన్‌రెడ్డి మరో అందమైన అబద్ధం చెప్పారు. మీరు వెనక్కి పంపించకపోతే ఎఫ్‌సీఐ గోదాముల వద్ద రోజుల తరబడి బియ్యం లోడ్ లారీలు ఎందుకు బారులు తీరాయి? అవసరమైన స్టోరేజీ లేదంటూ లారీలను నిలిపివేసింది మీ ఎఫ్‌సీఐ అధికారులు కాదా?
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎట్టకేలకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటున్న విషయం ఆయనకు ఇప్పుడే అర్థమయినట్టుంది. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు. అంటే ఇన్ని రోజులు ఆయన కావాలనే ధాన్యంపై రాజకీయాలు చేశారనేది స్పష్టమైంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తదని తెలిసి కూడా రా రైస్ ఇవ్వాలని అడగటంపై ఆయన ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మరో నిజాన్ని కూడా ఒప్పుకొన్నారు. బియ్యం స్టోరేజీ, రైల్వే ర్యాక్స్ కేటాయింపులతో రాష్ర్టానికి సంబంధం లేదని కూడాతెలిపారు.