హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన అధికారిక నివాసంలో వేముల తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, రవీంద్రనాయక్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, అధికారులు మంత్రి ప్రశాంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సొంత ఖర్చులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్
తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని సుమారు 2వేల మంది పదో తరగతి విద్యార్థులకు తన సొంత ఖర్చులతో డిజిటల్ స్టడీ మెటీరియల్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పలువురు నాయకులు, అధికారుల సమక్షంలో మెటీరియల్ ప్రతులను ఆవిష్కరించారు. స్టడీ మెటీరియల్‌కు సంబంధించిన బార్‌కోడ్‌ను త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.