హైదరాబాద్: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఉపాధి హామీ పథకంపై చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) కేంద్రానికి పోస్టుకార్డు రాశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో పోస్టు కార్డు రాసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. గత ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి 30 వేల కోట్ల కోత విధించారని చెప్పారు. దాంతో ఉపాధి హామీ కూలీలకు పని దినాలు తగ్గాయన్నారు.
వ్యవసాయ కూలీకి రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలికి వంద రూపాయలకు మించడం లేదని మంత్రి విమర్శించారు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండటంలేదని, టెంటు, మంచి నీళ్లు, గడ్డపారలు, పారలు, తట్టలు వంటివి అందించడం లేదని చెప్పారు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పనిచేసిన కూలీకి 480 రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ, ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ గిట్టడం లేదని వాపోయారు. ఆన్లైన్ పద్ధతివల్ల గ్రామీణ అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు నష్టం జరుగుతున్నదన్నారు. వారికి సెల్ఫోన్ సిగ్నల్స్ లేక ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేకపోతున్నారని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని, సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా వారే ఉంటున్నారని, కాబట్టి వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయటంవల్ల రైతులకు కూలీ గిట్టుబాటు అవుతుందని మంత్రి పోస్టు కార్డులో పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పని దినాలు కల్పించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఏపీవోల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని రాశారు. మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ఈ నెల 8న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురంలో ఈ పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభమైంది.