Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ సీతక్క, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో వేద పండితులతో వేదాశీర్వచనాలు వల్లించారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు తీర్థప్రసాదాలు, పరిమళ విభూది, స్వామి అమ్మవార్ల జ్ఞాపికలను అంద జేశారు.
అనంతరం టీజీ లక్ష్మీ వెంకటేశ్ భవన్ మల్లికార్జున నిత్యాన్నదాన సత్రానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీ కృష్ణ వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అల్పాహారం వారు స్వీకరించారు. ఈ సందర్భంగా సత్రంలో యాత్రికులకు అందించే సేవలు సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి తదితర ప్రాంతాల ఆర్యవైశ్యులు శ్రీశైల క్షేత్రంలో చేస్తున్న అన్నదాన
సేవలు అభినందనీయమని నిర్వాహకులను మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రాభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. తమవంతు సహాకారాన్ని అందించి యాత్రికులకు మోలికవసతులు, వసతి గదుల నిర్మాణాలు చేపట్టేందుకు దేవస్థానం సహకారం కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సత్రం డైరెక్టర్లు బచ్చు రామకృష్ణ, సురేష్, ఆంజనేయులు, రామయ్య పాల్గొన్నారు.