భూపాలపల్లి: సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకుపోతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో మహిళా సంఘాలతో రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్, కమలాపూర్ హెచ్డీఎఫ్సీ పరివర్తన్ వారి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలోని సుభాష్‌కాలనీలో రూ.66 లక్షలతో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్ర భవనం, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లాకు కేటాయించిన నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గీత కార్మికులకు అండగా ఉంటూ పూర్వ వైభవం తీసుకువస్తున్నారని అన్నారు. పూర్వం ఎక్కువగా చిరుధాన్యాలు పండించే వారని, ఇప్పుడు మనం ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళల రక్షణ, సంక్షేమం కోసం జిల్లాలో సఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.