హైదరాబాద్: తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిలో దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తీర్మానం కూడా ఉంది. ఆ తీర్మానంలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం మద్దతిస్తే తప్ప వ్యవసాయ రంగం నిలబడలేని స్థితి దేశమంతా అలుముకొని ఉంది. కానీ ఈ విషయంలో కేంద్రంలో ఇన్నేళ్లుగా పాలించిన ప్రభుత్వాలు ఎన్నడూ రైతుకు అండగా నిలబడలేదు. దేశంలో రైతులు పంట పెట్టుబడి నుంచి పంట కొనుగోలు దాకా అన్నిదశల్లోనూ అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు.తెలంగాణలో మాత్రమే దుక్కి దున్నిన దశ నుంచీ పంటల కొనుగోలు దాకా ప్రభుత్వం అడుగడుగునా అండదండలనిస్తున్నది.
రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వమే రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరానికి (రెండు పంటలకు) 10 వేల రూపాయలిస్తున్నది. రైతు ఏ కారణంచేత మరణించినా ఆ కుటుంబం ఆగం కావద్దని రైతు బీమా పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నది. రైతుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్ఐసీ సంస్థకు చెల్లిస్తున్నది. తెలంగాణలోని రైతుబంధు, రైతు బీమా పథకాలను ఐక్యరాజ్య సమితి కూడా అభినందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా 2.9 కోట్ల ఎకరాల పంట సాగవుతున్నది. దీంతో వానాకాలం, యాసంగి కలిపి దాదాపు మూడు కోట్ల టన్నుల పంటల దిగుబడి వస్తున్నది.
నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ అయింది. రైతు బాధలు తెలిసిన రైతుబిడ్డ మన సీఎం కేసీఆర్ ఏ తంటాలు లేకుండా, ఊరూరా కాంటాలు పెట్టించి మొత్తం ధాన్యాన్ని కొంటూ రైతు బాంధవుడిగా నిలిచారు. ఇదే విధంగా దేశమంతటా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపించడం ద్వారా అటు రైతుకు మేలు చేయడమేకాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెద్దఎత్తున కల్పించవచ్చు. అద్భుతమైన ఆహార వైవిధ్యం, సంస్కృతి ఉన్న భారతదేశంలో నేడు పిల్లలు, పెద్దలు విదేశీ మెక్ డొనాల్డ్ తదితర కంపెనీల పిజ్జాలు, బర్గర్లు తింటుండటం సిగ్గుచేటైన విషయం. దేశ పాలకులు సరిగా వ్యవహరిస్తే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను గొప్పగా అభివృద్ధి చేసి, దేశంలో అద్భుతమైన ఫుడ్ చైన్ నిర్మించవచ్చు.
మన దేశం బ్రాండ్‌తో విదేశాలకు అనేక ఫుడ్ ప్రొడక్టులను ఎగుమతి చేయవచ్చు. కానీ, ఇపుడు దేశంలో ఆ పని జరగడం లేదు. దిగుమతులే తప్ప ఎగుమతులు జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ దేశంలో రైతుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. పంటలు పండాల్సిన పొలాల్లో రైతుల శవాలు తేలుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 13 నెలలపాటు రైతులు ధర్నాలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో 750 మంది రైతులు ఆహుతైపోయారు. అయినా ఈ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైతు బాధలు తెలిసిన రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశమంతటా విస్తరించి, పంటలు పండించే రైతులను పాలకులుగా మార్చాలని, హలం పట్టిన చేతులతో కలం పట్టించి చట్టాలను తయారు చేయాలని, మట్టిని పిసికిన చేతులు మంచి ప్రణాళికలను రూపొందించాలని, రైతు సంక్షేమం వర్ధిల్లే విధంగా దేశంలో నిజమైన రైతు రాజ్యాన్ని నెలకొల్పే దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని ఈనాటి పార్టీ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.