హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలో రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల్లో ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాజకీయ పావులుగా మారి పనిచేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, బిల్లులను ఆమోదించడానికి కాలపరిమితి నిర్ణయించాలని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కొణతం దిలీప్ ట్వీట్ చేయగా దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఇబ్బంది పెట్టడం బీజేపీయేతర రాష్ట్రాల్లో స్పష్టంగా కనపడుతున్నదని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాలకు సహకరించడం లేదని, ప్రతీకారేచ్ఛతో వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. సహకార సమాఖ్య పాలనకు ఇదేమైనా మాడల్‌గా ఉంటుందా? అని ప్రశ్నించారు. టీం ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉన్నదని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఏవిధంగా దోహదపడుతుంది? అని కేటీఆర్ నిలదీశారు.