తాండూరు, సెప్టెంబర్ 9: స్వతహాగా వైద్యులై ఉండీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుంటే.. గవర్నర్ స్థానం లో ఉండి విమర్శిస్తారా అని ప్రశ్నించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు బస్తీ దవాఖానను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గవర్నర్ రాజకీయ నాయకురాలిలా ప్రవర్తించడం సరికాదన్నారు. ముందెన్నడూ లేనివిధంగా కేసీఆర్ పాలనలో విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక వైద్యసదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానలతోపాటు 3,200 పల్లె దవాఖానలను దసరా నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ పక్కనే ఉన్న రాష్ర్టాల ప్రజలు ఇక్కడి అభివృద్ధి, సంక్షేమాలను చూసి అక్కడ కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల వద్దకే వైద్యం లక్ష్యంతో బస్తీ దవాఖానల స్ఫూర్తితో పల్లె దవాఖానలు కూడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాతాశిశు సంక్షేమ అధికారి శ్వేత మహంతి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు.