సిద్దిపేట: ఐదేళ్లపాటు ‘సిద్దిపేట అభివృద్ధి’ పరీక్ష రాసి మీ ముందుకు వచ్చిన్నని, మార్కులు ఎన్ని వేస్తారనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నదని ఓటర్లను ఉద్దేశించి మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో ఆయన సమక్షంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణా రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఓటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే వచ్చేదెవరు..? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ మీతోనే ఉండేదెవరు..? అనేది అలోచించుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాలు నేను మీ కోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి నేను రాసిన పరీక్షకు మార్కులు వేయాలని మంత్రి కోరారు.
‘సిద్దిపేట అభివృద్ధి కోసం కష్టపడ్డాను. ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాకు మీరు ఓట్ల రూపంలో మార్కులు వేసి దీవించాలి’ అన్ని మంత్రి హరీష్రావు అభ్యర్థించారు. కాగా, గాడిపల్లి అరుణారెడ్డితో పాటు బీజేపీ అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ బండి సుగుణ, జిల్లా నాయకులు కనకమ్మ, ఇంద్ర, యాదమ్మ తదితరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.