హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్‌బీపాస్ ద్వారా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 64,553 ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరుచేశారు. 12,213 దరఖాస్తులను తిరస్కరించారు. కొంతమంది దరఖాస్తుదారులు పత్రాలు పూర్తి స్థాయిలో సమర్పించకపోవడం లాంటి కారణాలతో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొన్న 21 రోజుల తరువాత డీమ్డ్ అప్రూవల్‌గా అనుమతులు ఇస్తున్నారు. ఇలా 1,996 అనుమతులు ఇచ్చారు. టీఎస్‌బీపాస్ ద్వారా ఇండ్ల నిర్మాణాలకే కాకుండా లేఅవుట్స్‌కు కూడా అనుమతులు ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు అపోహలు, అనుమానాలు తొలగిపోతున్నాయి. అనుమతుల మంజూరు ఎక్కడా జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ప్రజల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించే విధంగా చర్యలు చేపట్టారు. విచారణలో జాప్యానికి కారణమైన అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపడుతున్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం జరిగితే సంబంధిత ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. ఫిర్యాదుల పరిషార వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌కు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ-మెయిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులతో పాటు, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులపై కూడా స్పందించనున్నారు. టీఎస్‌బీపాస్ ద్వారా ఇండ్లను మూడు క్యాటగిరీలుగా విభజించి అనమతులు మంజూరు చేస్తున్నారు.
ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్: మొదటి క్యాటగిరిలో 75 గజాల్లో నిర్మించే గృహలకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఇందులో సెల్ఫ్ సర్టిఫికేషన్ అవసరం ఉంటుంది. ఎలాంటి బిల్డింగ్ ప్లాన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.
ఇన్స్టంట్ అనుమతులు: రెండో క్యాటగిరిలో 75 గజాలకు పైబడిన 600 గజాల లోపు స్థలంలో నిర్మించే ఇండ్లకు ఇన్‌స్టంట్‌గా అనుమతులు ఇస్తారు. ఇందులో కూడా బిల్డింగ్ ప్లాన్ సమర్పించాల్సిన అవసరంలేదు.
సింగిల్ విండో అప్రూవల్స్: మూడో క్యాటగిరీగా సింగిల్ విండో అప్లికేషన్స్‌లో వాణిజ్య భవనాలకు అనుమతులు ఇస్తారు. గరిష్ఠంగా 21 పనిదినాల్లో భవన నిర్మాణానికి అనుమతులు ఇస్తారు. దరఖాస్తుదారులు బిల్డింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా సమర్పించాలి.
టీఎస్‌బీపాస్ ప్రారంభమైన తేదీ: 2020 నవంబర్ 16
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు: 96,584
అనుమతులు మంజూరైనవి: 64,553
డీమ్డ్ అప్రూవల్‌గా అనుమతి పొందినవి: 1,996
తిరస్కరించిన దరఖాస్తులు: 12,213
