ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే శీర్షికతో అచ్చయిన వార్తలు కోకొల్లలు. కానీ, ఇప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా తాను రోగినన్న బాధ కూడా లేకుండా సామాన్యులు స్వరాష్ట్రంలో దశ మారిన ధర్మాసుపత్రి వైపు ధైర్యంగా అడుగులేస్తున్న గొప్ప రోజులొచ్చాయి!
అంతలోనే ఎంత మార్పు?! ఔను, రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో తొమ్మిదిన్నరేండ్లలోనే అనూహ్య ప్రగతి చోటు చేసుకున్నది. విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలెన్నో ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ఇదంతా మంత్రం వేస్తేనో, మాయ చేస్తేనో సాధ్యం కాలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ‘ఆరోగ్య తెలంగాణ’గా మార్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో వచ్చిన ఫలితమిది.
…? కాసాని మహేందర్‌రెడ్డి

Telangana | ‘మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తి ఉండాలంటే రక్తంలో తెల్ల రక్తకణాలు పనిచేసినట్టే.. తెలంగాణ నుంచి తయారుకాబోతున్న తెల్లకోటు డాక్టర్లు రాష్ర్టానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడటంలో కీలకంగా పనిచేస్తారు’ అని ఇటీవల 9 కాలేజీల్లో తరగతులు ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. తెలంగాణలో వచ్చిన వైద్య, ఆరోగ్య విప్లవం సామాన్య జనానికి ప్రజారోగ్య వ్యవస్థ మీద పెరిగిన విశ్వాసం సీఎం కేసీఆర్ మాటలను రుజువు చేస్తున్నది.
నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: రాష్ట్ర ఏర్పాటుకు ముందు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లోనే ఉచిత డయాలసిస్ సెంటర్లు ఉండేవి. దూర ప్రాంతాల రోగులు అవస్థలు పడేవారు. సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఒక ఉచిత డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయించారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్, ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. 2014లో 3 డయాలసిస్ కేంద్రాలు ఉండగా 2023 నాటికి 82కు పెరిగాయి.
పరమపద ‘వాహన’ సేవ: మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వం 50 ‘హర్సే’ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.
అద్భుతంగా బస్తీ దవాఖానలు: సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు రూపకల్పన చేశారు. హైదరాబాద్‌లో 350, ఇతర మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారు 3 కోట్ల మంది సేవలు పొందారు. ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు వ్యయం చేసింది.
ఆరోగ్యశ్రీ: పథకం పరిధి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది. ఇప్పటివరకు 15,39,994 మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందారు. ఇందుకు ప్రభుత్వం రూ.6,823 కోట్లు వ్యయం చేసింది.
ఎన్సీడీ కిట్లు: ఎన్సీడీ స్రీనింగ్ ద్వారా బీపీ, షుగర్ వ్యాధి ఉన్న వారందరికి ఉచితంగా ప్రభుత్వం మందుల కిట్లను ఇంటికే పంపిణీ చేస్తున్నది. జిల్లా, సీహెచ్‌సీల్లో ప్రత్యేక క్లినిక్స్ ఏర్పాటు చేసింది.
ఆరోగ్య మహిళ: ఈ ఏడాది మార్చి 8వ తేదీ నుంచి ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే 8 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
టీ డయాగ్నొస్టిక్స్: ఇందులో భాగంగా పీహెచ్‌సీలు మొదలు అన్ని స్థాయుల దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. సుమారు 50 లక్షల మంది లబ్ధి పొందారు. ప్రభుత్వం రూ.250 కోట్ల వరకు వ్యయం చేసింది.
టిఫా స్కానింగ్ యంత్రాలు: 44 దవాఖానల్లో 56 టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గర్భిణులకు ఒక్కో స్కానింగ్‌కు రూ.2000 వరకు ఆదా అవుతున్నది.
క్యాథ్‌ల్యాబ్‌లు: గుండెపోట్లను వెంటనే గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, ఖమ్మం, రిమ్స్ ఆదిలాబాద్‌ల్లో క్యాథ్‌ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. 74 ఉపకేంద్రాల్లో ఈసీజీలు తీస్తున్నారు.
ప్రాథమిక వైద్యం బలోపేతం

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను బలోపేతం చేసింది. రూ.67 కోట్లతో 43 కొత్త పీహెచ్సీ భవనాలను నిర్మిస్తున్నది. రూ.43 కోట్లతో 372 పీహెచ్‌సీల మరమ్మతులు చేపట్టింది. నూతనంగా ఏర్పడిన 40 మండలాలకు పీహెచ్‌సీలు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1239 సబ్ సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున ఏకంగా రూ.247 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. అదనంగా 1497 సబ్ సెంటర్ల భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. పీహెచ్‌సీల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రికార్డు సమయంలో ఏకంగా 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించింది. బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా 3,200 సబ్ సెంటర్లను ‘పల్లె దవాఖాన’లుగా అభివృద్ధి చేస్తున్నది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
గర్భిణుల్లో రక్తహీనతను, పోషకాల లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లక్ష్యం:
6.84 లక్షల మంది
చేసిన వ్యయం:
రూ.50 కోట్లు
సామాజిక ప్రయోజనాలెన్నో…

అమ్మఒడి వాహనసేవలు
గర్భిణులు సురక్షితంగా దవాఖానకు వెళ్లి, చెకప్ చేయించుకొని తిరిగి ఇంటికి చేర్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
ఆరోగ్య లక్ష్మి: గర్భిణులు, బాలింతలకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు.
2014 నుంచి ఇప్పటివరకు 36,26,603 మంది ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారులు నమోదయ్యారు.
ప్రజావైద్యంపై పెరిగిన నమ్మకం

రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నది. వైద్య సేవలు మెరుగుపడటంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2021, 22 మధ్య పోల్చినప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ, ఐపీ, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

జిల్లాకో మెడికల్ కాలేజీ
రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 5. గాంధీ, ఉస్మానియా కాలేజీలు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే ఏర్పాటయ్యాయి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. సుమారు ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో ఏర్పాటు చేసినవి ఆదిలాబాద్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలే. ఉమ్మడి రాష్ట్రంలో 30 ఏండ్లకు ఒక కాలేజీ ఏర్పాటు చేస్తే.. సీఎం కేసీఆర్ 9 ఏండ్లలోనే 21 కాలేజీలను ఏర్పాటు చేశారు. మరో 8 కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాదితో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నది. జిల్లాకో నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలోనూ భారీగా విద్యాసంస్థలు పెరిగాయి.

ఏటా 10 వేల మంది డాక్టర్లు..
ఒకప్పుడు తెలంగాణలో వైద్యవిద్య చదవాలంటే చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి.. కానీ ఇప్పుడు ఏటా 10 వేల మంది వైద్యులను తయారు చేసే ‘డాక్టర్ల కార్ఖానా’గా మారింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం ఫలితం ఇది. ఇప్పటికే 21 కాలేజీలు ఏర్పాటు చేయగా, మరో 8 కాలేజీలు వచ్చే ఏడు ప్రారంభం కానున్నాయి. ఫలితంగా 2014తో పోల్చితే రాష్ట్రంలో ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయి.

హెల్త్ ఇండెక్స్‌లో అగ్రస్థానం
అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంత వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ 2021లో ‘హెల్త్ ఇండెక్స్’ను విడుదల చేసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానం, పురోగతిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్, ఆసుపత్రి ప్రసవాల పురోగతిలో తెలంగాణ దేశంలోనే టాప్. 2019-20లో వైద్యారోగ్యంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ర్టాల్లో తెలంగాణది మూడో స్థానం.

కంటివెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 2018 లో నిర్వహించిన మొదటి విడుత కంటివెలుగులో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది నిర్వహించిన రెండో విడుతలో 1.65 కోట్ల మందికి కంటి పరీక్షలు జరిగాయి.
5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు

2022, ఏప్రిల్ 26న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో టిమ్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. వరంగల్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. నిమ్స్‌లో అదనంగా 2000 సూపర్ స్పెషాలిటీ పడకలను విస్తరిస్తున్నారు. వీటన్నింటికీ గతేడాది సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటిద్వారా 8 వేలకుపైగా సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి
వరంగల్ హెల్త్ సిటీ 2,000 పడకలు
నాలుగు టిమ్స్ 4,200 పడకలు
నిమ్స్ విస్తరణ 2,000 పడకలు
మొత్తం 8,200 పడకలు

మాతాశిశు సేవలకు జేజేలు
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది. గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ కిట్ పథకాన్ని 2017, జూన్ 2 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయిన గర్భిణికి మగశిశువు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలను ప్రభుత్వం అందిస్తున్నది.

కేసీఆర్ కిట్ లబ్ధిదారులు: 13,90,636 మంది
అందించిన ఆర్థిక సాయం: రూ.1,261 కోట్లు
సుమారు 50,000 పడకలు

ఉమ్మడి రాష్ట్రంలో మూడున్నర కోట్ల మందికి అన్ని దవాఖానల్లో కలిపి 17 వేల పడకలే ఉండేవి. ఆక్సిజన్ పడకలు 1400 మాత్రమే. అంటే 100లో 8 పడకలకే (8 శాతం) ఆక్సిజన్ సరఫరా ఉండేది. అత్యవసర సేవలు అందించే ఐసీయూలు, బ్లడ్ బ్యాంకులు వంటివాటి గణాంకాలు ఇంకా దారుణంగా ఉండేవి. సీఎం కేసీఆర్ పడకల సంఖ్య డబుల్ చేయడమే కాదు.. అన్నింటినీ ఆక్సిజన్ పడకలుగా మార్చేశారు. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ, దవాఖానల అప్‌గ్రేడేషన్ వంటివన్నీ కలిపితే రాష్ట్రంలోని పడకల సంఖ్య 50 వేలకు చేరనున్నది.
