దుబ్బాక, డిసెంబర్ 25: తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. 70 ఏండ్లలో గత ప్రభుత్వాలు చేయలేని వైద్యారోగ్య సంస్కరణలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసి చూపారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 100 పడకల దవాఖానను శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో ‘సర్కారు దవాఖానకు నేను రాను బిడ్డో’ అనే పరిస్థితి ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఇప్పుడు సర్కారు దవాఖానల్లోనే వైద్యం చేయించుకునేందుకు రోగులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కేసీఆర్ కిట్ పథకంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 52శాతానికి పెరిగిందని వెల్లడించారు. ప్రైవేటు దవాఖానలతో పోల్చితే సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, సర్కారు దవాఖానలను బలోపేతం చేసిందని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని పిలుపునిచ్చా రు. టీకాలతోపాటు మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తే కరోనా ఒమిక్రాన్‌ను తరిమికొట్టవచ్చని సూచించారు. విదేశాల్లో కరోనా నియంత్రణకు బూస్టర్ డోసు వేస్తున్నారని, మన దేశంలో బూస్టర్ డోసు వేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు గుర్తుచేశారు. అనంతరం దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో రూ.1.3 కోట్లతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.