హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో భాగంగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న క్యాడర్ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. జిల్లాలవారీగా ఉద్యోగ సంఘాలు, యూనియన్ నేతలతో చర్చిస్తున్నారు. ఏపీలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో అక్కడి విలీన ప్రక్రియ, ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రయోజనాలు, సమస్యలు వంటి వాటిని అధ్యయనం చేసేందుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు బుధవారం విజయవాడ వెళ్లాలని నిర్ణయించారు.
అధ్యయన నివేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల రూపకల్పన కమిటీకి అందిస్తారు. మార్గదర్శకాల అధ్యయన కమిటీలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఏపీలో అధికారుల కమిటీ మాత్రమే మార్గదర్శకాలు రూపొందించడంతో విలీనం తర్వాత రెండున్నరేళ్లకు ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొన్ని అంశాల్లో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇక్కడలాంటి సమస్యలు తలెత్తకుండా ఆ కమిటీలో తమకు కూడా అవకాశం కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు టీఎంయూ నేతలు ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు వినతిపత్రాలు అందించారు. ఉద్యోగుల హోదా, వేతనం, సౌకర్యాలు, ఆర్టీసీ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ, స్టాఫ్ బెనిఫిట్ స్కీం, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం, పెన్షన్ విధానం, ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్ వంటి అంశాలపై మార్గదర్శకాల రూపకల్పనలో స్పష్టత ఉండాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం రెండు పీఆర్సీలు పెండింగులో ఉండడంతో ఫిట్మెంట్ ఖరారు చేసేందుకు వీలుగా మార్గదర్శకాల రూపకల్పన కమిటీలో తమకు ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.