హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రవాణాశాఖలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాహనాల ఫిట్నెస్ పరీక్షల కోసం ఏర్పాటు చేయనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) టెండర్ల ప్రక్రియలో స్కామ్ జరిగినట్టు సమాచారం. టెండర్ల నిబంధనలను కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా మార్చారనే ఆరోపణలున్నాయి. ఈ టెండర్ల పరిణామ క్రమం, వ్యయం పెంపుదల, అర్హతా ప్రమాణాల్లో మార్పులపై లోతైన స్వతంత్ర విచారణ జరపాలని తెలంగాణ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలిసింది. ఏటీఎస్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మొదట 2025 ఫిబ్రవరిలో వచ్చిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వా త రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 ప్రాంతాల్లో విడివిడిగా టెండర్లు ఆహ్వానించారు. దీనివల్ల మధ్యస్థాయి మౌలిక సదుపాయాల సంస్థలు, ప్రాంతీయ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఈ విధానాన్ని మార్చేసిన అధికారులు.. పలు ప్రాంతాలను కలిపి క్లస్టర్-1, క్లస్టర్-2 అనే పెద్ద కాంట్రాక్టులుగా మార్చారు. ఈ క్లస్టర్ విధానంతో ప్రాజెక్టు పరిమాణం, వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఈ టెండర్ల వ్యవహారం క్లస్టర్ విధానంలోకి మారిన తర్వాత బిడ్డర్లకు ఉండాల్సిన అర్హతలను ఊహించని విధంగా పెంచేశారు. గతంలో కనీసం 3 ఏండ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను ఏకంగా 15 ఏండ్లకు పెంచారు. సగటు టర్నోవర్‌ను రూ. 40 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచడంతోపాటు ఏదైనా ఒక ఏడాదిలో రూ.150 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధన పెట్టారు. గతంలో కేవలం పాజిటివ్ నెట్‌వర్త్ ఉంటే సరిపోయేది. దానిని క్లస్టర్-1కు రూ.50 కోట్లకు పెంచి ఆ తర్వాత రూ.10 కోట్లకు సవరించారు. క్లస్టర్-2కు మాత్రం కేవలం రూ.8.95 కోట్లుగా ఉంచారు. ఒకే రకమైన ప్రాజెక్టులకు వేర్వేరు ప్రమాణాలు నిర్ణయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పరికరాల తయారీదారులు (ఓఈఎం) ఒకరి కంటే ఎకువ మంది బిడ్డర్లకు సపోర్ట్ లెటర్లు ఇవ్వకూడదనే నిబంధనను తెచ్చారు. దీనివల్ల మారెట్లో పోటీ చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన సంస్థలకే టెండర్లు దక్కనున్నాయి.
టెండర్ నిబంధనలను మార్చడంతోపాటు ఒకో ఏటీఎస్ కేంద్రం అంచనా వ్యయాన్ని కూడా భారీగా పెంచారు. 2025 ఫిబ్రవరి నాటి అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఒక ఏటీఎస్ కేంద్రానికి రూ.8 కోట్లు కేటాయించగా.. టెండర్ వ్యయాన్ని రూ.6.10 కోట్లుగా చూపారు. కానీ, 2026 జనవరి నాటి సవరించిన నివేదికలో ఒకో కేంద్రం వ్యయాన్ని రూ.11.50 కోట్లకు పెంచారు. అంటే ఒకో కేంద్రానికి రూ.3.50 కోట్లు అదనంగా పెరిగింది. దీనితోపాటు గతంలో లేని ఐటీ హార్డ్‌వేర్‌కు రూ.2.44 కోట్లు, ఫర్నిచర్‌కు రూ.1.62 కోట్లు, డాక్యుమెంటేషన్/ట్రైనింగ్‌కు రూ.80 లక్షలు లాంటి కొత్త ఖర్చులను అదనంగా చేర్చారు. ఈ వ్యయాల పెంపుదలకు సంబంధించి ఎటువంటి మారెట్ బెంచ్ మారింగ్ కానీ, టెక్నికల్ రిపోర్టులు కానీ బహిరంగపరచలేదు. దీంతో ఒక్కో ఏటీఎస్ నిర్మాణానికి ఖర్చు తడిసి మోపెడు అవుతున్నది. ఉదాహరణకు నల్లగొండ టెండర్లో 3 లేన్ల టెస్టింగ్ ఎక్విప్మెంట్ ధర రూ.1.76 కోట్లుగా ఉండగా.. క్లస్టర్ టెండర్లలో ఎలాంటి మారెట్ అధ్యయనం లేకుండానే ఆ ధరను రూ.2.18 కోట్లకు పెంచినట్టు బిడ్డర్లు చెప్తున్నారు.
సవరించిన నిబంధనలన్నీ రాష్ట్రంలోని ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ ఎస్ఎల్ఆర్ ఇన్‌ఫ్రాతోపాటు ఏటీఎస్ పరికరాల తయారీ సంస్థలైన ఎంఏహెచ్ఏ ఈఎల్జీఐ ప్రొఫైల్‌కు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయని పలువురు బిడ్డర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్-1, క్లస్టర్-2 టెండర్లలో ఈ సంస్థలే కన్సార్షియంగా ఏర్పడి పాల్గొన్నాయని చెప్తున్నారు. మిగిలిన కంపెనీలు కేవలం టెండర్ ప్రక్రియలో పోటీ ఉన్నట్టు చూపేందుకే పరిమితమయ్యేలా నిబంధనలను రూపొందించారని సమాచారం. కాగా, టెండర్ల అధికారిక ప్రకటనకు ముందే డ్రాఫ్ట్ నిబంధనలు లీక్ అయ్యాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రవాణా శాఖ ఉన్నతాధికారుల నుండి వచ్చిన ఇన్పుట్స్ ఆధారంగానే ఈ నిబంధనలను మార్చినట్లు తెలుస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వ కొనుగోళ్లలో సమన్యాయం జరగాలంటే ఈ టెండర్ ప్రక్రియపై స్వతంత్ర కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రవాణా శాఖ ఉన్నతాధికారులకు బిడ్డర్లు, కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.