Bade Chokka Rao | ములుగు, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ శివారులో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస్ బడే చొక్కారావు మృతి విషయంపై ఉత్కంఠకు తెరపడింది. దా మోదర్ ఎన్కౌంటర్ విషయం రోజుకో మలుపు తిరగుతూ వస్తున్నది. కాగా, ఆయన భద్రంగానే ఉన్నట్టు సోమవా రం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదటి నుంచి ఆయన మృతిని తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు, కాల్వపల్లి గ్రామస్థులు నమ్మలేదు. వారి నమ్మకమే నిజమైంది.
కాగా ఆయన కాంకేర్ శివారు అటవీ ప్రాం తంలో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడినట్టు తెలిసింది. నాలుగు అంచెల భద్రత కలిగిన దామోదర్ ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో మూడు రోజులుగా ములుగు జిల్లాతోపాటు తెలుగు రాష్ర్టాల్లో దామోదర్ మృతిపై వచ్చిన వదంతులు అవాస్తవమని తేలాయి. తాను సురక్షితంగానే ఉన్న ట్టు దామోదర్ తన అనుచరుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసినట్టు తెలిసింది.