Runa Mafi | హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాలేదన్నది నిజం. ఆ బాధతోనే రైతు ప్రాణం కోల్పోయాడన్నది నిజం. కానీ, రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్‌రెడ్డి మరణంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది. పచ్చి అబద్ధాలను వల్లె వేస్తున్నది. ఆ రైతు కుటుంబానికి పైసా రుణమాఫీ కాకపోయినా, రూ.1.5 లక్షలు మాఫీ అయిందని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలాడుతున్నారు. అంతేకాదు, రైతు మరణానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు పెట్టాలంటూ ఉల్టా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ చామల ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ‘చనిపోయిన రైతు సురేందర్‌రెడ్డి కుటుంబంలో ఆయన తల్లికి రూ.1.5 లక్షల రుణమాఫీ జరిగింది.
సురేందర్‌రెడ్డి ఆత్మహత్య విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను రెచ్చగొట్టేల వ్యవహరించిన హరీశ్‌రావుపై నేరపూరిత కుట్ర 61(2), ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ 108 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఎంపీ చామల తన లేఖలో పేర్కొన్నారు. తప్పుడు వివరాలతో, రాజకీయ దురుద్దేశంతో ఎంపీ ఈ విధంగా లేఖ రాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది రైతు మరణాన్ని కించపరిచడమేనని, రైతు మరణాన్ని రాజకీయ చేయడం సిగ్గు చేటంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సుశీలకు ఇప్పటివరకు నయా పైసా కూడా రుణమాఫీ కాలేదని చిట్టాపూర్ ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు, సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి నిర్ధారించడంతో ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినదంతా అబద్ధమని తేలిపోయింది. ఆ రైతు తల్లి పేరు సోలిపేట సుశీల. ఆమెకు చిట్టాపూర్ ఏపీజీవీబీ బ్యాంకులో రుణ ఖాతా నంబర్ 73047252135పై రూ.1,03,587 పంట రుణం ఉన్నది. ఆమెకు సంబంధించిన రుణమాఫీ స్టేట్మెంట్ను అధికారులు విడుదల చేశారు. ఇందులో రుణమాఫీ కాకపోవడానికి కారణంపై ‘నిర్ధారణ చేయవలసి ఉన్నది’, ‘To be Processed’ అని చూపిస్తున్నది. సురేందర్‌రెడ్డి తల్లికి రుణమాఫీ కాలేదని అధికారులే స్వయంగా చెప్పడంతో దీనిపై ఎంపీ చామల ఏం సమాధానం చెబుతారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీస వివరాలు తెలుసుకోకుండా రైతు మరణాన్ని కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎంపీగా ఉంటూ కనీస అవగాహన లేకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారంటూ రైతులు మండిపడుతున్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి రైతు ఆత్మహత్యకు సంబంధించి కలెక్టర్‌కు లేఖ రాస్తున్నప్పుడు కనీస వివరాలు, నిజాలు తెలుసుకోవాలి. కానీ, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టి, పూర్తి అబద్ధాలతో లేఖ రాయడంపై విమర్శలొస్తున్నాయి. ఆయన లేఖ రాసే ముందు ఏ అధికారికి ఫోన్ చేసినా నిజాలు చెప్పేవారని, కానీ ఆయన నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలున్నాయి. ఇలాంటి వ్యక్తి ఎంపీగా ఉండేందుకు అనర్హుడంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక ఎంపీగా రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా రైతులపైనే నిందలు వేసే విధంగా పూనుకోవడం విచారకరమని మండిపడుతున్నారు.
రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధన రైతు సురేందర్‌రెడ్డి ప్రాణం తీసింది. రేషన్‌కార్డులో ఆయనతోపాటు ఆయన తల్లి పేరు ఉన్నందున రుణమాఫీ కాలేదని బ్యాంకు అధికారులే తెలిపారు. ఒకే రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లు ఉండటం, ఇద్దరి పేర్లపై రూ.2 లక్షలకుపైగా రుణం ఉండటంతో వారికి మాఫీ కాలేదు. ఆయన అన్న రవీందర్‌రెడ్డికి రేషన్‌కార్డుపై ఆయన పేరు మాత్రమే ఉండటంతో రూ.1.57 లక్షలు మాఫీ అయ్యాయి. అంటే ప్రభుత్వం పెట్టిన రేషన్‌కార్డు నిబంధన కారణంగానే తనకు రుణమాఫీ కాలేదని రైతు సురేందర్‌రెడ్డికి అర్థమైంది. ఇక తనకు రుణమాఫీ కాదని ఆయన భావించారు. అందుకే చిట్టాపూర్ నుంచి ఆవేదనతో మేడ్చల్‌లోని తన ఇంటికి వచ్చిన ఆయన స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం రైతు ఆవేదనను పట్టించుకోకుండా ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసే దురాలోచనలో ఉండటంపై విమర్శలొస్తున్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఈ నెల 6న రైతు సోలిపేట సురేందర్‌రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ కాకపోవడమే తన చావుకు కారణమని లేఖ రాశారు. దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి పదేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లాకు వలస వచ్చారు. తన సొంత గ్రామంలో ఆయనకు వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనకు అన్న రవీందర్‌రెడ్డి, తల్లి సుశీల ఉన్నారు. వివాహ అనంతరం తర్వాత అన్న రవీందర్‌రెడ్డి వేరుపడగా ఆయనకు విడిగా రేషన్‌కార్డు వచ్చింది. దీంతో సురేందర్‌రెడ్డి, ఆయన తల్లి సుశీల ఒకే రేషన్‌కార్డుపై కొనసాగుతున్నారు.
సురేందర్‌రెడ్డి తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమితో చిట్టాపూర్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.1.92 లక్షల రుణం పొందారు. ఆయన తల్లి సుశీల పేరుపై రూ.1.03 లక్షల రుణం ఉన్నది. రవీందర్‌రెడ్డి పేరుపై రూ.1.57 లక్షల రుణం ఉన్నది. రేషన్‌కార్డు వేరుగా ఉన్న కారణంగా రవీందర్‌రెడ్డి రుణం మాఫీ కాగా సురేందర్‌రెడ్డి, తల్లి సుశీల రుణం మాఫీ కాలేదు. దీనిపై అధికారులను ఆరా తీయగా సురేందర్‌రెడ్డి, తల్లి సుశీల ఒకే రేషన్‌కార్డుపై ఉండటం వల్ల రుణమాఫీ కాలేదని తెలిపారు. దీంతో తనకు రుణమాఫీ కాదంటూ మనస్తాపానికి గురైన సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు.