హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి విపక్ష పార్టీలు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించాయి. మంగళవారం దళితబంధుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో విపక్ష నేతలు మాట్లాడుతూ.. దళితులతోపాటు, ముస్లింలు, బీసీలు, అగ్రవర్ణ పేదలకు కూడా ఇటువంటి పథకాన్ని తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. దళితబంధుపై చర్చను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రారంభించారు. ఆ తర్వాత అధికార విపక్ష సభ్యులు మాట్లాడారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.
నిధులకోసం కేంద్రాన్ని ఒప్పిస్తాం: రఘునందన్‌రావు
దళితబంధు ఆలోచనా బాగానే ఉన్నదని, ఆచరణ కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు అన్నారు. దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు ఫలాలు అందాలని, దీనికి అవసరమైన నిర్దిష్టమైన టైమ్ టేబుల్‌ను ప్రకటించాలని కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం వద్దకు అఖిలపక్షంగా పథకం అమలుకు నిధులు కోరుదామని, కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. దళితబంధు పథకాన్ని బీజేపీ రాజకీయ కోణంలో చూడడంలేదని చెప్పారు.
దళితబంధుకు సంపూర్ణ మద్దతు: అక్బరుద్దీన్ ఒవైసీ
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సం పూర్ణ మద్దతు ఉంటుందని ఎంఐ ఎంపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పా రు. దళితబంధు స్వాగతిస్తున్నామన్నారు. కులగణనపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ.. సభలో తీర్మానం చేయాలన్నారు. దళితబంధును ముస్లింలకు కూడా వర్తింపజేస్తారా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో ముస్లింలను భాగస్వాములను చేయాలని కోరారు.
అట్టడుగు వర్గాలకూ ఇవ్వాలి: బలాలా
దళితులకోసం ఇంత మంచి పథకం ప్రవేశపెట్టడం ఎంతో మంచి విషయమని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా చెప్పారు. దీంతో దళితులు సొంతకాళ్లపై నిలబడే అవకాశం ఏర్పడిందని తెలిపారు. దళితబంధు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు మేలు చేస్తున్నదెవరో, అణగదొక్కుతున్నదెవరో ప్రజలే గుర్తించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తం చేయాలి : భట్టి విక్రమార్క
దళితబంధును రాష్ట్రమంతటా అమలుచేయాలని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకూ ఇటువంటి పథకాన్ని తేవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలకు దళితబంధు వర్తింపజేయాలంటే రూ.1.7 లక్షల కోట్లు అవసరమవుతాయని స్వయంగా సీఎం చెప్పారని.. కానీ ఈ ఏడాది బడ్జెట్లో దళిత్ ఎంపవర్మెంట్ పేరుతో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. దళితబంధుకు ఇవి ఎలా సరిపోతాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. దశలవారీగా అమలు చేసినట్టయితే ఏడాదికి ఏ మేరకు నిధులు విడుదలచేస్తారో చెప్పాలని కోరారు. దళితబంధులో భాగంగా మిగులు భూములను పంచి ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా పైండ్లెన చాలామందికి రేషన్ కార్డులు లేవని.. వారికి కూడా పథకం వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. దళితబంధుపై చట్టం చేస్తే బావుంటుందన్నారు. పోడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ జనగణనకు తీర్మానం చేద్దామన్నారు. ఎస్సీ, ఎస్టీల వార్షికాదాయ పరిమితిని కూడా పెంచాలని కోరారు.