హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ నిర్వహించి, హైకోర్టు ఎదుట మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను మోదీ వెంటనే ఉపసంహరించుకోవాలి అని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.