హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రచారంపైనే యావ తప్ప క్షేత్రస్థాయి సవాళ్లపై కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం దృష్టి సారించలేదని తేలింది. దీంతో పథకం కాగితాలకే పరిమితమైది. నెలలు గడుస్తున్నా ఆచరణలోకి రాలేకపోయింది. గత మే నెలలో నాగర్‌కర్నూల్ జిల్లా మాచారం గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే నాటి నుంచి ఇప్పటికీ ఒక్క అడుగుకు కూడా ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రాబోయే ఐదేండ్లలో రూ.126 కోట్లతో దాదాపు 2.10 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సాగునీటి వసతిని కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ పథకం కింద పట్టా కలిగిన అటవీ భూముల్లో వ్యవసాయ బోరు వేయడంతోపాటు, సౌర విద్యుత్తు ద్వారా నడిచే పంపుసెట్లను లబ్ధిదారులకు అందజేస్తారు. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల వరకు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. రాబోయే ఐదేండ్లలో ఈ పథకం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 2025-26 సంవత్సరంలో రూ.6 కోట్లతో 10వేల ఎకరాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దాదాపు 27,184 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలని భావించింది.
గిరి సౌర జలవికాసం పథకం అమలుకు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని గిరిజన సంక్షేమశాఖ అధికారులే స్వయంగా పేర్కొంటున్నారు. ఈ పథకం ప్రధానంగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అమలు చేయాల్సి రావడంతో అటవీశాఖ సిబ్బంది నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తున్నాయి. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్నా కూడా అటవీశాఖ అధికారులు బోర్లు వేయడానికి, సర్వే చేసేందుకూ అంగీకరించడం లేదని గిరిజన సంక్షేమ అధికారులు చెప్తున్నారు. సోలార్ పంపుసెట్లు గరిష్ఠంగా 200 అడుగుల లోతు నుంచి మాత్రమే నీటిని తోడగలవు. అప్పుడే సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతుకు మించితే సోలార్ పంపుసెట్లు పనిచేయడం అంతంత మాత్రమేనని తెలుస్తున్నది. కొండ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూభౌతిక పరిస్థితుల కారణంగా 200 అడుగుల కంటే ఎక్కువ లోతులో తప్ప భూగర్భజలాలు అందుబాటులో లేవు. కేవలం నదులు, వాగులకు సమీపంలో ఉన్నచోట మాత్రమే సౌర పంపుసెట్లు పనిచేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం మార్గదర్శకాలను మారిస్తే తప్ప పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయ లేమని గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. బోర్లకు బదులు ఓపెన్ వెల్స్ తవ్వుకోవాలని భావించినా ఖర్చు తడిసి మోపెడవుతున్నది. గరిష్ఠంగా 50 అడుగుల లోతు లో బావి తవ్వినా బోరుబావులతో పోలి స్తే అధికంగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.6 లక్షల నిధులు సరిపోవని తేలింది. దీంతో పథకం అమలు నత్తనడకన కొనసాగుతున్నదని అధికారులు వివరిస్తున్నారు. అటవీ అధికారుల నుంచి అనుమతులు ఇప్పించి, అవసరమైన చోట అధికంగా ఖర్చుచేసేలా నిధులు సర్దుబాటు చేసేలా మార్పులు చేయాలని భావిస్తున్నారు.