హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): భూమికి పచ్చని రంగు వేయాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ అడవుల్లో చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 17న కేసీఆర్ పుట్టినరోజున సుందర్బన్ డెల్టా ప్రాంతంలో నాటిన 20వేల మాంగ్రోవ్ మొక్కలు దాదాపు మూడు అడుగుల ఎత్తుకు పెరిగాయి. ఆ ప్రాంతమంతా హరితశోభను సంతరించుకున్నది. ఏపుగా పెరిగిన మొక్కలను సంతోష్‌కుమార్ నేతృత్వంలోని గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం ఇటీవల సందర్శించింది. రెండు నెలల్లోనే పచ్చదనం సంతరించుకున్న ఆ ప్రాంతాన్ని చూసి సంతోషం వ్యక్తంచేసింది.
యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సుందర్బన్ అడవులు ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రోవ్ ఎకోసిస్టమ్‌కు కీలకంగా ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల సమూహంగా ఉన్నది. ఇవి బంగాళాఖాతంలో గంగ, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల డెల్టా ప్రాంతంలో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉన్నాయి. ప్రత్యేక జీవ వైవిధ్యం, అద్భుతమైన సహజ సౌందర్యానికి ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఈ మడ అడవులు తీరానికి గొప్ప రక్షణ కలిగిస్తూ గ్రీన్ఆర్మ్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాయి.
తీర ప్రాంతాల ప్రజలను తుఫాన్లు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంతాల నుంచి కోతల నుంచి ఈ అడవులు కాపాడుతూ వస్తున్నాయి. మాంగ్రోవ్ మొక్కలు పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యానికి, భూమిపై ఉండే సాధారణ అడవుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ను తమలో నిల్వ చేసుకొంటాయి. వాతావరణ మార్పులను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం పర్యావరణ ప్రేమికులతోపాటు పౌరుల్లో స్ఫూర్తిని నింపుతున్నది. శాస్త్రీయ పద్ధతిలో జియోట్యాగింగ్ విధానంలో నాటిన ఈ మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో నెలల వ్యవధిలోనే ఏపుగా పెరిగాయి.
కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం కేవలం రాష్ర్టానికే పరిమితం కాకూడదనే సంకల్పంతో 2018లో సంతోష్‌కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పేరిట దేశమంతటా హరితోద్యమానికి నాంది పలికారు. ఈ పర్యావరణ ఉద్యమంలో భాగంగా కోట్లాది విత్తనాలను అడవుల్లో నాటారు. యువత, విద్యార్థులతో మమేకమై కోట్ల మొక్కలకు ప్రాణం పోశారు. యువతతోపాటు ప్రజా ప్రతినిధులు, ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్లు, పౌర సమాజాన్ని హరిత విప్లవంలో భాగస్వామ్యం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఇప్పటివరకు 19 కోట్లకుపైగా మొక్కలు నాటడంతోపాటు 20వేలకుపైగా జలవనరులకు పునరుజ్జీవం కల్పించారు. కేవలం చెట్లు నాటడమే కాకుండా, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సుందర్బన్ అడవుల్లో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం విజయం సాధించడం దేశవ్యాప్తంగా హరిత దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ సుందర్బన్ మడ అడవుల పెంపకానికి చేసిన ప్రయత్నం యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని పంపుతున్నదని పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ ప్రశంసించింది. వాతావరణ పరిరక్షణ చర్యలు ఒక నిరంతర ప్రజా ఉద్యమంగా కొనసాగాలని సంస్థ అభిప్రాయపడింది. బతికున్న ప్రతి చెట్టూ మన భవిష్యత్తుకు దోహదపడుతుందని పేర్కొన్నది. వాతావరణ మార్పులతో దేశం, ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపడుతున్న కార్యక్రమాలు పర్యావరణ పునరుద్ధరణకు ఆచరణాత్మకమైన, విస్తరించదగిన నమూనాను అందిస్తాయని అభిప్రాయపడింది. సుందర్బన్ అడవుల్లో అభివృద్ధి చెందుతున్న మడ అడవులు కేసీఆర్ పర్యావరణ దార్శనికతకు నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్నది. సంతోష్‌కుమార్ నాయకత్వంలో ఈ ఉద్యమం లక్షలాది మంది పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని ప్రశంసించింది.
పచ్చని చెట్లతోనే ఆరోగ్యకరమైన జీవనం పొందగలుగుతాం. మనం నాటే ప్రతి మొక్క భవిష్యత్తుపై ఓ నమ్మకం, జీవితంపై ఆశ కలిగిస్తుంది. మనమంతా కలిసి ధరిత్రిని పచ్చగా మార్చగలిగితే ప్రకృతి రూపురేఖలు మారిపోతాయి. రాబోయే తరాలకు సుస్థిరమైన ఆరోగ్యమైన భవిష్యత్తును అందిస్తాయి.
-సంతోష్‌కుమార్, మాజీ ఎంపీ, జీఐసీ వ్యవస్థాపకుడు