హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించనున్నది. సోమవారంతో కంటివెలుగులో నిర్వహించిన కంటి పరీక్షల సంఖ్య కోటిన్నరకు చేరనున్నది. కేవలం 80 పనిదినాల్లో కోటిన్నర పరీక్షలు నిర్వహించిన అరుదైన రికార్డును రాష్ట్రం సొంతం చేసుకోనున్నది. ఈ ఏడాది జనవరి 18న ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అప్పటి నుంచి శని, ఆదివారాలు, సెలవు దినాల్లో తప్ప ఇతర రోజుల్లో నిరాటంకంగా కొనసాగుతున్నది. కంటి పరీక్షల నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా 1,500 ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు అనుకున్న లక్ష్యంలో సుమారు 88 శాతం పూర్తయ్యింది.
20 రోజులు ముందుగానే..!
కంటివెలుగులో భాగంగా రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వంద పనిదినాల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. అయితే 80 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. ఈ నెల 19 నాటికి (79 రోజుల్లో) కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 1.49 కోట్లు. సోమవారం మరో 89 వేల మంది పరీక్షలు చేయించుకుంటే కోటిన్నర మైలురాయిని అధిగమించనున్నది. కంటివెలుగుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం, ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైందని వైద్యసిబ్బంది చెప్తున్నారు. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య 8.8 లక్షలు అధికంగా ఉన్నది. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల్లో 38.39 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం సంఖ్యలో ఇది 25 శాతం. 1.10 కోట్ల మందికి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు.
Ka