Junior Doctors | తమకు రెగ్యులర్‌గా స్టయిఫెండ్ ఇవ్వడంతోపాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని, లేదంటే అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తామని ప్రభుతాన్ని హెచ్చరించారు.
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ)/ బన్సీలాల్‌పేట్/సుల్తాన్‌బజార్: ఈ నెల 24లోగా జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఎమర్జెన్సీ మినహా విధులను బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని శనివారం గాంధీ, ఉస్మానియా దవాఖానలలోని వైద్య కళాశాలల జూనియర్ డాక్టర్లు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.
జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ వంశీ, ప్రధాన కార్యదర్సి లౌక్య, ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దీపాంకర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రికా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ైస్టెఫండ్ను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. తెలంగాణలో ఏపీ విద్యార్థులకు ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్ తొలగించాలని, అవుట్ పోస్ట్‌లో పోలీసుల సంఖ్య పెంచాలని, హాస్టల్ సదుపాయం కల్పించాలని వారు కోరారు. 24 లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఎమర్జన్సీ,ఐసీయూ మినహా అన్ని విభాగాలలో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఇసాక్ న్యూటన్, డాక్టర్ మహేశ్, డాక్టర్ సుచరిత, డాక్టర్ జగన్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.