హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. శనివారం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
చివరి రోజైన ఆదివారం జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.