హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టావిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకవుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగనున్న ఈ సమ్మేళనం పోస్టర్‌ను గురువారం తన నివాసంలో కవిత ఆవిషరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతోపాటు యువతలో సాహితీ సృ్పహను, చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువకవులు తమ కలాలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు. కవులు ఈ సమ్మేళనంలో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాటస్ఫూర్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేలపై అనేక గొప్ప కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని కలిగించాలని, ఆ పరంపరను కొనసాగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు.
గోలొండ కవుల సంచిక ద్వారా సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణ రచయితలు, కవులు, కవయిత్రుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని, ఆ స్ఫూర్తితో తాము ముందుకు సాగుతున్నట్టు కవిత వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాహిత్యానికి కనీస గౌరవమే ఇవ్వడం లేదని విమర్శించారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. దున్నపోతుపై వాన పడినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. జానపదానికి గౌరవం దకడం కోసం జీవితాంతం కృషి చేసిన బిరుదురాజు శత జయంతికి రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని, అలాగే గొప్ప కవులు, కళాకారులు సమాజానికి చేసిన సేవలను ప్రభుత్వం విస్మరించడం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, ఘనపురం దేవేందర్, జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్‌రావు, మనోజ్‌గౌడ్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
యువకవుల సమ్మేళనంలో పాల్గొనాలనుకున్న కవులు, కవయిత్రులు 35 ఏండ్ల లోపు వారై ఉండాలని కవిత తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో కవితలు వినిపించవచ్చునని తెలిపారు. ఈ మేరకు తమ వివరాలు నమోదు చేయించుకోవడానికి ఈ నెల26 లోపు kavitha. telangana @gmail. comకు మెయిల్ చేయాలని కవిత సూచించారు.